భారత ప్రధాని మోడీ. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్. ఇద్దరు మహామహులు తమిళనాడులోని చారిత్రక ప్రాంతమైన మహాబలిపురంలో భేటీ అయ్యారు. ప్రధాని మోడీ తన విదేశీ పర్యటనలకు భిన్నంగా అచ్చమైన తమిళ సంప్రదాయం కొట్టొచ్చినట్లు డ్రెస్ వేసుకున్నారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు ప్రధాని మోడీ 1000 సంవత్సరాల చరిత్ర కల అక్కడి కట్టడాలు..వాటి చారిత్రక ప్రాధాన్యతలు వివరించారు. జిన్‌పింగ్ విడిది చేసిన మహాబలిపురంలో చైనా అధ్యక్షుడితో కలిసి మోదీ చారిత్రక కట్టడాలను సందర్శించారు. శోర్ ఆలయ ప్రాంగణాన్ని ఇరువురు నేతలు కలియతిరిగారు.
మోదీ జిన్‌పింగ్‌లు ఆలయ ప్రాంగణంలో భేటీ అయ్యారు. కొబ్బరి నీరు సేవిస్తూ వారు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. అంతకుముందు మహాబలిపురంలో అర్జునుడు తపస్సు చేసిన ప్రాంతం, పంచరథాలు కొలువుతీరిన ప్రదేశాలను వారు సందర్శించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య శనివారం ఫిషర్‌మెన్ కోవ్ రిసార్ట్స్ లో ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. చర్చల అనంతరం ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గౌరవార్ధం లంచ్ ఏర్పాటు చేస్తారు.