హుజూర్ నగర్ లో మద్దతుపై సీపీఐ కొత్త ట్విస్ట్

Update: 2019-10-09 11:33 GMT

ఆర్టీసీ సమ్మె వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర బంద్ దిశగా అడుగులు వేస్తోంది. అన్ని పార్టీలు ఏకమై సర్కారుపై పోరుకు రెడీ అవుతున్నాయి. ఈ తరుణంలో సీపీఐ కొత్త ట్విస్ట్ ఇఛ్చింది. ఆర్టీసీకి సంబంధించి ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు మద్దతుపై పునరాలోచన చేస్తామని ప్రకటించారు. నిన్నటి వరకూ మద్దతు వేరు..ఆర్టీసీ సమ్మె వేరు అని ప్రకటించిన సీపీఐ నాయకులు పలు వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడికి తలొగ్గినట్లే కన్పిస్తోంది. అందుకే చాడా కీలక ప్రకటన చేశారు. ఎప్పుడూ తెలంగాణలో వామపక్షాల ఉనికిని పెద్దగా గుర్తించని టీఆర్ఎఎస్ హుజూర్ నగర్ ఉప ఎన్నిక కోసం ఆకస్మాత్తుగా సీపీఐ మద్దతు కోసం పార్టీ నేతలను పంపిన విషయం తెలిసిందే. ఆర్టీసి సమ్మె వ్యవహారం ఒక రకంగా సీపీఐకి పెద్ద చికాకే తెచ్చిపెట్టింది.

ఇదిలా ఉంటే తెలంగాణ బంద్ పై గురువారం నాడు తుది నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం వెల్లడించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్లే సమ్మె అనివార్యం అయిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మరో సకల జనుల సమ్మెకు సిద్ధం కావాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఆర్టీసి ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని..వీటిని అన్ని పార్టీలు కలసి సంయుక్తంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆర్టీసి సమ్మెపై అఖిలపక్ష నేతలు గవర్నర్ కు వినతిపత్రం అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల19న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చే అవకాశం ఉందని సమాచారం.

 

Similar News