ఆర్టీసి సమ్మె అంశంపై బుధవారం నాడు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో సమావేశం అయిన అఖిలపక్ష నేతలు సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిందే అని బిజెపి ఎమ్మెల్సీ రామచందర్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణలో అసలు ధర్నాలే ఉండవన్న కెసీఆర్ చివరకు ధర్నా చౌక్ ను ఎత్తేసి కోర్టుతో చీవాట్లు తిన్నారని విమర్శించారు.పండగ పేరుతో కెసీఆర్ కార్మికులపై వ్యతిరేకత తెచ్చే ప్రయత్నం చేశారని విమర్శించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ కార్మికుల సమ్మకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. సీఎం కెసీఆర్ మాటలే అహంకార పూరితంగా ఉన్నాయన్నారు. కెసీఆర్ కు పుస్తకాలు చదివే అలావాటు ఉంటే చట్టం తెలుసుకోవాలని తమ్మినేని సీతారాం సూచించారు. కెసీఆర్ కు ప్రైవేట్ సంస్థలతో మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని..అందులో భాగంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఆర్టీసీ రూట్లను ప్రైవేట్ పరం చేసి ఓ ముఖ్యమంత్రి తన పదవిని కోల్పోయారని టీ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్టీసీలో 1200 మంది ఉద్యోగులే ఉన్నారన్న కెసీఆర్ ప్రకటన రాజ్యాంగ విరుద్ధం అన్నారు.
కార్మికుల ఏ పోరాటం చేసినా టీ టీడీపీ మద్దతుగా ఉంటుందని తెలిపారు. అప్పుల్లో ఉన్న ఆర్టీసీనీ ప్రయివేటీకరణ చేస్తానని చెబుతున్న సీఎం కేసీఆర్.. మరి అప్పుల్లో ఉన్న ప్రభుత్వాన్ని ప్రయివేట్ వ్యక్తులకు అప్పగించగలరా అంటూ జస్టిస్ చంద్రకుమార్ ప్రశ్నించారు. దాదాపు 50 వేల ఆర్టీసీ కార్మికుల కుటుంబాలతో సీఎం చెలగాటం ఆడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బుధవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో కోదండరాం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్, టీఎంయూ ఆర్టీసీ యూనియన్ అధ్యక్షుడు అశ్వద్దామరెడ్డి, ఆర్టీసీ సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు కార్మికులు, తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా అశ్వద్దామరెడ్డి మాట్లాడుతూ.. సమ్మె ముఖ్య ఉద్దేశం జీతభత్యాలు కాదని స్పష్టం చేశారు. ‘ఆర్టీసీ సమ్మెపై సీఎం చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. అయితే ఆర్టీసీని బతికించడమే మా లక్ష్యం. గత ఐదేళ్ల నుంచి ఆర్టీసీలో ఒక్క నియామకం జరగలేదు. కార్మికులు దాచుకున్న పీఎఫ్ డబ్బును ఎందుకు ఇవ్వడం లేదు?. ఆర్టీసీపై డిజీల్ భారం ఎక్కువైంది.
27 శాతం డిజీల్‌పై పన్ను వేస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థపై నాలుగో వంతు ప్రజలు ఆధారపడి ఉన్నారు. ప్రజలు మా సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు మాకు సహకరించాలి. అవసరమైతే తెలంగాణ బందుకు పిలుపునిద్దాం’అని అశ్వద్ధామరెడ్డి పేర్కొన్నారు. బుధవారంతో తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె ఐదో రోజుకు చేరింది. ప్రజల ప్రయాణ కష్టాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. దసరా పండగ ముగించుకోని తిరిగి గమ్యస్థానాలకు వెళ్లాలనుకునేవారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమ్మెపై ఏ విధంగా ముందుకు వెళ్లాలి, న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా పోరాడటానికి ఏం చేయాలనే దానిపై అఖిలపక్ష సమావేశంలో చర్చిస్తున్నారు.