కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి గత కొంత కాలంగా పార్టీ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీఏసీ సమావేశంలో పాల్గొన్న సిఎల్పీ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ సమావేశాలు నిర్దేశిత రోజులు జరపాలని డిమాండ్ చేయాల్సింది పోయి ఢిల్లీలోని కాన్ స్టిట్యూషనల్ క్లబ్ తరహాలో హైదరాబాద్ లో కూడా క్లబ్ కట్టాలని డిమాండ్ చేయటంపై రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీలపై చర్చించకుండా ఇతర అంశాలు బీఏసీ ఏజెండాలో చర్చించటం..అందుకు కాంగ్రెస్ పార్టీ కారణం కావటం ఏమిటని ఆయన తన సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేశారు. ఈ సారి అసెంబ్లీ లాబీల్లో బహిరంగంగానే అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
విద్యుత్ అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో లేకపోవటం సరికాదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గవర్నర్ ను కలిసేందుకే తమ పార్టీ నేతలు వెళ్ళారని..దీనికి సంబంధించి తనకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు పదవి వస్తుందో..ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికకు సంబంధించి అధిష్టానం ఇంకా ఎవరి పేరు ఖరారు చేయలేదన్నారు. కొద్ది రోజుల క్రితం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ నుంచి తన భార్య పద్మావతి పోటీ చేస్తుందని ప్రకటించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం ఈ సీటు శ్యామల కిరణ్ రెడ్డి పేరును తాను ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్ కూడా రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యురేనియంపై సంపత్ కు ఏబీసీడీలు కూడా తెలియవన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన యురేనియం అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ నేతలు వెళ్ళటాన్ని సంపత్ తీవ్రంగా తప్పుపట్టిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇఫ్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారబోతున్నాయి. గత కొంత కాలంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా మాత్రం ఉత్తమ్ కు పూర్తి మద్దతు అందిస్తున్నారు. ఇది కూడా పార్టీ నేతల్లో ఆగ్రహానికి కారణం అవుతోంది. ఉత్తమ్, కుంతియాలు తెలంగాణ వ్యవహారాలు చూసినంత కాలం తెలంగాణ కాంగ్రెస్ ను ఎవరూ బాగుచేయలేరని ఆ పార్టీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా రేవంత్ చేసిన వ్యాఖ్యలతో ఉత్తమ్- రేవంత్ వర్గాల మధ్య టికెట్ వార్ మొదలైనట్లు అయింది.