కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన బెయిల్ పిటీషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయనకు మరికొన్ని రోజులు జైలు వాసం తప్పేలా లేదు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో చిదంబరం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఢిల్లీ హైకోర్టు ఉత‍్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బెయిల్ కోసం చిదంబరం సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానాన్ని ఆశ్రయించవచ్చని పేర్కొంది. మరోవైపు సీబీఐ రిమాండ్‌ను సవాల్ చేస్తూ చిదంబరం న్యాయవాదులు ఎలాంటి పిటిషన్ దాఖలు చేయనందున దీనిపై తాము ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని న్యాయమూర్తి జస్టిస్ ఆర్ భానుమతి పేర్కొన్నారు.
ఈ కేసులో చిదంబరంను అయిదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి తరలించగా సోమవారం తో ఈ గడువు ముగిసింది. చిదంబరంను అరెస్ట్ చేయడం ద్వారా ఆయనకు సంక్రమించిన హక్కులను సీబీఐ కాలరాసిందని చిదంబరం తరపున వాదించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నారు. కోర్టు పరిధిలో విచారణ సాగుతున్న క్రమంలో సీబీఐ అత్యుత్సాహంతో ఆయనను అరెస్ట్ చేసిందని అభ్యంతరం వ్యక్తం చేశారు.