కాశ్మీర్ విభజన బిల్లుకు లోక్ సభ గ్రీన్ సిగ్నల్

Update: 2019-08-06 14:43 GMT

రాజ్యసభ సోమవారం ఓకే చేసింది. మంగళవారం లోక్ సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యంత కీలకమైన కాశ్మీర్ విభజన బిల్లును ఉభయ సభలు ఆమోదించాయి. దీనిపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తుండగా..అధికార బిజెపి మాత్రం ఉత్సాహంతో దూసుకెళుతోంది. అత్యంత కీలకమైన ఆర్టికల్ 370 రద్దు కాగా, జమ్మూకాశ్మీర్ ను రెండు రాష్ట్రాలుగా విభజించే బిల్లులకు ఆమోదం లభించింది. ఇది భారత దేశ రాజకీయాల్లో ఓ కొత్త చరిత్రగా పేర్కొనటంలో ఎలాంటి సందేహం లేదు. ఆర్టికల్ 370 రద్దు విషయంలో కాంగ్రెస్ పార్టీలో చీలికలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. అయితే ఆ పార్టీ మాత్రం అధికారికంగా ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తోంది. జమ్మూ కాశ్మీర్ ప్రజలను, పార్టీలను భాగస్వాములు చేయకుండా ఇలా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవటం సరికాదని ఆ పార్టీ వాదిస్తోంది. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. మంగళవారం రాత్రి లోక్‌సభలో హోంమంత్రి అమిత్‌ షా ప్రవేశపెట్టిన జమ్మూ కాశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు–2019కు అనుకూలంగా 370 మంది, వ్యతిరేకంగా 70 మంది ఓటు వేశారు. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35–ఏలను రద్దు చేసిన తీర్మానం కూడా లోక్‌సభ ఆమోదం పొందింది.

ఈ తీర్మానానికి అనుకూలంగా 351 మంది, వ్యతిరేకంగా 72 మంది ఓటు వేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌, జేడీ(యూ) సభ నుంచి వాకౌట్‌ చేశాయి. లోక్‌సభ ఆమోదంతో జమ్మూ కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు, ఆర్టికల్ 370, ఆర్టికల్‌ 35–ఏల రద్దు తీర్మానాలను పార్లమెంట్‌ ఆమోదించినట్లు అయింది. ఈ రెండింటినీ రాజ్యసభ సొమవారం ఆమోదించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ఆమోదం తర్వాత చట్టంగా మారనుంది. బిల్లును ఆమోదించిన తర్వాత లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. కశ్మీర్‌ విభజన బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందడంతో లడాఖ్‌ పూర్తిగా కేంద్ర పాలిత ప్రాంతంగా మారనుంది. అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూ కశ్మీర్‌ ఉంటుంది. జమ్మూ కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేయడంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి.

 

Similar News