ముగ్గురు ఎమ్మెల్యేలకు స్పీకర్ షాక్

Update: 2019-07-25 15:48 GMT

కుమారస్వామి సర్కారు పతనం తర్వాత కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓ వైపు బిజెపి సర్కారు ఏర్పాటుపై ఊగిసలాడుతున్న తరుణంలో స్పీకర్ నిర్ణయం ఆ ఎమ్మెల్యేలకు షాక్ లాంటిదే. ఇంకా దాదాపు నాలుగుసంవత్సరాల పదవి కాలాన్ని ఈ దెబ్బకు వారు కోల్పోవలసి వచ్చింది. ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ గురువారం అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆర్‌.శంకర్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రమేష్‌ జార్జ్‌ హోళి, మహేష్‌... 2023 వరకూ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటన చేశారు. విశ్వాస తీర్మానంలో కుమారస్వామి ప్రభుత్వానికి వీరంతా మద్దతు ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో శంకర్‌ కేపీజేపీ (కర్ణాటక ప్రజకీయ జనతా పార్టీ) తరపును పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఈ ఏడాది జూన్‌ 14న గవర్నర్‌కు లేఖ ఇచ్చారు. అంతేకాకుండా కేపీజేపీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. విలీన ప్రక్రియకు స్పీకర్‌ ఈ ఏడాది జూన్‌ 25న ఆమోదం తెలపడంతో ఆర్‌.శంకర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా పరిగణిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే శంకర్‌ బీజేపీలోకి చేరేందుకు సన్నద్ధం అయ్యారు. దీంతో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత సిద్ధరామయ్య ఆయనపై అనర్హత పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ ఫిర్యాదుపై స్పీకర్‌ గురువారం నిర్ణయం తీసుకున్నారు. తాజా పరిణామాలపై బిజెపి ఎలాంటి వ్యూహం అమలు చేస్తుందో వేచిచూడాల్సిందే.

 

 

 

Similar News