ఎట్టకేలకు క్షమాపణ చెప్పిన ఎంపీ

Update: 2019-07-29 08:15 GMT

ఆయనకు నోటిదురుసుతనం కొత్తేమీ కాదు. వివాదస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ సమాజ్ వాది పార్టీ ఎంపీ ఆజం ఖాన్. తాజాగా లోక్ సభలోనూ అదే తీరు కనపరిచారు. ఆయన తీరును సభ అంతా పార్టీలకు అతీతంగా ఖండించగా..క్షమాపణలు చెప్పకపోతే చర్యలు తప్పవనే హెచ్చరికలు జారీ చేయటంతో ఆయన దారికొచ్చారు. అసలు విషయం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం బీజేపీ ఎంపీ, లోక్‌సభ అధ్యక్ష స్ధానంలో కూర్చున్న రమాదేవిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు ఆజంఖాన్. దీనికి సంబంధించి ఆయన సోమవారం నాడు సభలో క్షమాపణలు చెప్పారు. రమాదేవి తన సోదరి వంటిదని తాను గతంలోనే పలమార్లు చెప్పానని, ఆమె ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడాలనేది తన అభిమతం కాదని స్పష్టం చేశారు. తాను మాట్లాడే భాష, మేనరిజమ్స్‌ గురించి పార్లమెంట్‌లో అందరికీ తెలుసునని, తాను పొరపాటుగా వ్యాఖ్యానిస్తే క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.

సోమవారం ఉదయం సభ ప్రారంభమయ్యే ముందు ఆజం ఖాన్‌ ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌తో కలిసి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిశారు. రమాదేవిపై చేసిన వ్యాఖ్యలపై ఈ సందర్భంగా ఆయన వివరణ ఇచ్చారు. సభాధ్యక్ష స్ధానాన్ని అగౌరవపరచాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. మరోవైపు ఆజం ఖాన్‌ క్షమాపణను బీజేపీ ఎంపీ రమాదేవి అంగీకరించలేదు. ఆజం ఖాన్‌ వైఖరి మహిళలను, దేశాన్ని బాధించిందని చెప్పారు. ఆయన ఎప్పుడూ ఇలాగే మాట్లాడుతున్నారని, ఆయన తీరులో ఎలాంటి మార్పు లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడే తన పద్ధతి మార్చుకోవాలని రమాదేవి హెచ్చరించారు.

 

Similar News