మల్లు భట్టివిక్రమార్క దీక్ష భగ్నం

Update: 2019-06-10 03:25 GMT

తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ హాట్ గా మారాయి. ఫిరాయింపుల వ్యవహారం తెలంగాణలో వేడి రాజేస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. దేశంలోనే ఫిరాయింపులకు ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీనే అంటూ అధికార టీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓ దళితుడు సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం కెసీఆర్ కు ఇష్టం లేదని..అందుకే అవసరం లేకపోయినా ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారని ఆరోపిస్తోంది. అసలు సభలో ప్రతిపక్షమే లేకుండా అధికార పార్టీ ఏమి చేస్తుందని..తెలంగాణ సమాజానికి ఏమి సంకేతం పంపదలచుకున్నారని ప్రశ్నిస్తోంది. సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు సోమవారం ఉదయం భగ్నం చేశారు.

ఆయన ఆరోగ్యం క్షీణించడంతో బలవంతంగా నిమ్స్‌ కు తరలించారు. భట్టి విక్రమార్క బీపీ, షుగర్‌ లెవల్స్, ఎర్ర రక్తకణాలు పడిపోవడంతో తక్షణమే వైద్యం అందించాలని ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు వెల్లడించారు. దీంతో పోలీసులు ...ఆయనను అరెస్ట్‌ చేసి ఆస్పత్రికి తరలించగా, వైద్యం చేయించుకునేందుకు భట్టి నిరాకరిస్తున్నారు. రెండు రోజుల పాటు సాగిన భట్టి విక్రమార్క దీక్షకు పలువురు నేతలు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఈ అక్రమ విలీనంపై కోర్టును కూడా ఆశ్రయించేందుకు రెడీ అవుతోంది. టీఆర్ఎస్ తీరుపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎటు మలుపుతిరుగుతాయో వేచిచూడాల్సిందే.

 

Similar News