ఏపీకి అండగా కేంద్రం

Update: 2019-06-09 14:27 GMT

నరేంద్రమోడీ రెండవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆదివారం సాయంత్రం తిరుపతికి వచ్చారు. తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన ఆయన పార్టీ సమావేశంలో కూడా పాల్గొన్నారు. జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. ఏపీలో జగన్ నాయకత్వంలో శక్తివంతమైన ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. ఈ సందర్భంగా జగన్‌కు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. ఏపీ ప్రజల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని స్పష్టం చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో రేణిగుంట దగ్గర ఏర్పాటు చేసిన ప్రజా ధన్యవాద సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. అభివృద్ధిలో దూసుకుపోవడానికి అన్ని అవకాశాలు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా చేయూత ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు.

ఏపీలో అభివృద్ధికి అన్ని అవకాశాలున్నాయని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలకు చేరుకున్న మోదీకి శ్రీవారి ఆలయం ఎదుట ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, టీటీడీ ఈవో అనీల్‌కుమార్‌ సింఘాల్‌, ఇతర అధికారులు స్వాగతం పలికారు. టీటీడీ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి మహాద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధాన మంత్రి హోదాలో మోడీ మూడో సారి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇంతకు ముందు 2015 అక్టోబర్‌ 3వతేదీ, 2017 జనవరి 3న మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Similar News