ఇది నా ఒక్కడి గెలుపు కాదు..వైసీపీ ఎల్పీ నేతగా జగన్

Update: 2019-05-25 06:36 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లతో అప్రతిహత విజయాన్ని అందుకున్న వైసీపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు సాగుతోంది. శనివారం నాడు అమరావతిలో జరిగిన వైఎస్సార్ సీపీ సమావేశంలో జగన్ ను ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీనియర్ నేత బొత్స సత్యనారాయణ జగన్ పేరును ప్రతిపాదించగా..పలువురు ఎమ్మెల్యేలు ఈ ప్రతిపాదనను ఆమోదించారు. అనంతరం జగన్ మాట్లాడుతూ ఈ గెలుపు తన ఒక్కిడిదే కాదన్నారు. ఇప్పటి నుంచే 2024 లక్ష్యంగా పనిచేయాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. సుపరిపాలనతో మంచివాడిని అన్పించుకుంటా అని తెలిపారు. ప్రజల విశ్వాసం చూరగొనే అధికారంలోకి వచ్చామన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు..ఎంపీల బాధ్యతతో ముందుకు వెళ్ళాలన్నారు.

దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా చేద్దాం. 50 శాతం ఓటింగ్ సాధించటం గొప్ప విషయం . అన్యాయం, అధర్మం చేస్తే దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. టీడీపీ వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది. వాళ్ళకు మే 23నే దేవుడు బుద్దిచెప్పాడు. టీడీపీకి 23 సీట్లే ఇచ్చాడు అని వ్యాఖ్యానించారు. వైసీఎల్పీ తీర్మాన ప్రతిని తీసుకుని పార్టీ నేతలు బొత్స, ధర్మాన, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరారు. వీరు గవర్నర్ నరసింహన్ ను కలసి తీర్మాన ప్రతిని అందజేయనున్నారు. శనివారం సాయంత్రం జగన్ కూడా గవర్నర్ తో భేటీ కానున్నారు. ఆ తర్వాత మే 30 జగన్ ఏపీ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

 

Similar News