ఫలితాలపై టెన్షన్...టెన్షన్

Update: 2019-05-22 05:48 GMT

చంద్రబాబు తన అధికారం నిలబెట్టుకుంటారా?. లేక జగన్ అధికారం దక్కించుకుంటారా?. తెలంగాణలో టీఆర్ఎస్ ముందు నుంచి చెబుతున్నట్లు 16 ఎంపీ సీట్లు దక్కించుకుంటుందా?. ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ఎవరి అంచనాలు వారివి. కానీ రాజకీయ పార్టీల్లో..ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్ధుల్లో టెన్షన్ టెన్షన్. ప్రజల్లో కూడా ఉత్కంఠ అదే రేంజ్ లో ఉంది. తెలంగాణతో పోలిస్తే ఏపీ ఫలితాలపైనే అందరిలో ఆసక్తి ఉంది. ఎందుకంటే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి కాబట్టి. తెలంగాణలో కేవలం లోక్ సభ ఫలితాలే కాబట్టి పెద్దగా ఉత్సుకత లేదనే చెప్పొచ్చు. హోరాహోరీ సాగిన ఏపీ పోరులో జగన్ దే ఈ సారి పై చేయి అని స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే అధికార టీడీపీ కూడా పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ, పెంచిన పెన్షన్లు తమను గట్టెక్కిస్తాయనే నమ్మకంతో ఉన్నాయి. అయితే గురువారం ఉదయం పదకొండు గంటలకే ‘ట్రెండ్స్’ గెలుపు ఎవరిదో స్పష్టం చేసే అవకాశం ఉంది. తుది ఫలితాల వెల్లడికి రాత్రి వరకూ సమయం పట్టే అవకాశం ఉంది.

ఏపీ విషయానికి వస్తే ప్రతిపక్షం చాలా వరకూ కూల్ గా ఉంటే..అధికార టీడీపీ ఈవీఎంల దగ్గర నుంచి మొదలుకుని పలు అంశాల్లో నానా హంగామా చేస్తోంది. సహజంగా ప్రతిపక్షాలు ఆందోళనలు చేయటం సహజం. కానీ ఈ సారి పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కన్పిస్తోంది. టీడీపీనే ప్రతిపక్షం తరహాలో పలు అంశాలపై ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి. అంతే కాదు..కౌంటింగ్ కేంద్రాల్లోనూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగే సూచనలే కన్పిస్తున్నాయి. ఎందుకంటే రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఏ మాత్రం చిన్న సంఘటన జరిగినా రచ్చ రచ్చ జరగటం ఖాయం అంటున్నారు. దీంతో ఏపీలో ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్నికలు జరిగిన తర్వాత 43 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు గురువారంతో తెరపడనుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే కొన్ని జాతీయ ఛానళ్ల అంచనాలు ఆసక్తిరేపుతున్నాయి. టీఆర్ఎస్ కు ఎంతో పట్టున్న కరీంనగర్ వంటి నియోజకవర్గం బిజెపి గెలుచుకునే అంచనాలు వెలువడటం ఆసక్తికరంగా మారింది. దీంతోపాటు పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య గట్టి పోటీ ఉంది. మరికొన్ని చోట్ల ఆసక్తికరంగా టీఆర్ఎస్-బిజెపి ల మధ్య ఫైటింగ్ సాగింది. మరి ఫలితాలు ఎలా ఉంటాయో వేచిచూడాల్సిందే.

Similar News