మసూద్ అంతర్జాతీయ ఉగ్రవాదే

Update: 2019-05-01 14:27 GMT

చైనా చివరికి ఒత్తిడికి తలొగ్గింది. జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్ అజహర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ విషయంలో చైనాపై అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ లు తీవ్ర ఒత్తిడి చేయటంతో చివరకు చైనా దీనికి అంగీకరించక తప్పలేదు. తాజా పరిణామంతో గత కొన్ని సంవత్సరాలుగా భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించినట్లు అయింది. జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్ అజర్ ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించటంతో భారత్ హర్షం వ్యక్తం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామాలో ఉగ్రదాడికి పాల్పడింది తామేనని జైషే మహ్మద్‌ అంగీకరించిన సంగతి తెలిసిందే.

ఈ ఉగ్రదాడి అనంతరం మసూద్‌ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భారత్‌ పదే పదే ఐక్యరాజ్యసమితిని కోరింది. అయితే ఈ ప్రతిపాదనను చైనా నాలుగు సార్లు అడ్డుకున్నప్పటికీ చివరికి భారత్‌దే పైచేయి అయింది. మసూద్‌ని బ్లాక్‌ లిస్ట్‌ లో చేర్చినట్లు భారత అంబాసిడర్‌ సయ్యద్‌ అక్బరుద్దీన్‌ తెలిపారు. ‘అందరికీ శుభవార్త.. మసూద్ అజర్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ విషయంలో అందరి సహకారం చాలా గొప్పది. అందరికీ ధన్యవాదాలు’ అని అక్బరుద్దీన్‌ ట్వీట్‌ చేశారు. ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై పాకిస్థాన్ కూడా స్పందించింది. మసూద్ అజహర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించటం వల్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంది.

 

Similar News