జగన్ మంత్రివర్గ విస్తరణ ముహుర్తం ఖరారు!

Update: 2019-05-29 16:13 GMT

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వడివడిగా అడుగులు వేసేందుకు జగన్మోహన్ రెడ్డి రెడీ అవుతున్నారు. గురువారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్ జూన్ 7న మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశం ఉంది. విస్తరణకు పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నందున జగన్ కొంత సమయం తీసుకున్నారని చెబుతున్నారు. మంత్రివర్గ విస్తరణ ఏర్పాటు పూర్తయిన వెంటనే జూన్ 11 నుంచి కొన్ని రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించటానికి రెడీ అవుతున్నారు. తొలుత సభ్యుల ప్రమాణ స్వీకారాలు పూర్తి చేసి..తర్వాత మరో దఫా సమావేశాలు పెట్టి పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టేందుకు రెడీ అవుతున్నారు.

సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జగన్ పలు కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. అదే సమయంలో కీలక పోస్టింగ్ లకు కూడా గ్రీన్ సిగ్నల్ రానుంది. ప్రమాణ స్వీకారం అనంతరం జగన్ ఢిల్లీలో జరిగే ప్రధాని నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. శుక్రవారం తొలిసారి సచివాలయంలోకి సీఎంగా జగన్ అడుగు పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే సచివాలయంలోని బ్లాక్ వన్ లో సీఎం నూతన ఛాంబర్ సిద్ధం అయింది. తొలి రోజే జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. నూతన సీఎం ప్రమాణ స్వీకారానికి విజయవాడ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

 

Similar News