‘కోడ్ మినహాయింపు’ కోరిన చంద్రబాబు

Update: 2019-05-01 13:34 GMT

ఫోని తుఫాన్ ఉత్తరాంధ్ర జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాల్లో ఎన్నికల కోడ్ ను సడలించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం( సీఈసీ)కి లేఖ రాశారు. 2014లో హుద్‌హుద్ తుఫాన్ వచ్చి విశాఖ నగరంతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో సృష్టించిన విలయాన్ని ఇంకా మరచిపోలేదు. తాజాగా 2018 అక్టోబరు మాసంలో తిత్లీ తుఫాను విరుచుకుపడి ఉత్తరాంధ్ర తీరప్రాంతాన్ని తుడిచిపెట్టి వెళ్లింది. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు తిత్లీ కలిగించిన నష్టం అపారం. అంతేకాదు, ఈ తుఫాన్ల కారణంగా కమ్యూనికేషన్ సౌకర్యాలు స్థంభించిపోవడం, విద్యుఛ్ఛక్తి సరఫరా నిలిచిపోవడం, రహదారి మార్గాలు ధ్వంసం కావడం వంటి పెను నష్టాలెన్నో మా రాష్ర్టం చూసింది. ప్రస్తుత ఫోనీ సూపర్ తుఫాన్ వల్ల ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతానికి చెందిన నాలుగు జిల్లాలకు ప్రమాదం పొంచి వుందని మా ఆర్ టీజీఎస్ తో పాటు భారత ప్రభుత్వ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు సమాచారాన్ని తీర ప్రాంతాల వారికి చేరవేయడానికి, తగిన వస్తు, మానవ వనరుల సమీకరణకు, ఇతర నష్ట నివారణ చర్యలను చేపట్టడానికి ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రధాన అడ్డంకిగా ఉంది. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఈ నియమావళిని కొంత సడలించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ఇప్పటికే పూర్తయినందున, పైన పేర్కొన్న నాలుగు జిల్లాలలో ప్రవర్తనా నియమావళిని సడలించాలని కోరుతున్నాను. తద్వారా సంబంధిత ప్రభుత్వ, అధికార యంత్రాంగాలు, సంబంధిత మంత్రులు ఆయా జిల్లాలలో ప్రభావవంతంగా పనిచేయగలిగేందుకు వీలవుతుందని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.

 

 

Similar News