ప్రముఖ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ కు ఊహించని షాక్. ఆయన తాజాగా చేసిన ‘హిందూ ఉగ్రవాది’ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. గాంధీని హత్యచేసిన గాడ్సేనే తొలి హిందూ ఉగ్రవాది అంటూ వ్యాఖ్యానించి కమల్ పెద్ద కలకలానికి కారణం అయ్యారు. ఇప్పటికే ఆయనపై దీనికి సంబంధించి కేసు నమోదు అయింది. కమల్ వ్యాఖ్యలపై బిజెపి తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ తరుణంలో ఆయన ప్రచార సభపైకి కొంత మంది చెప్పులు విసిరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ రోడ్ షో లో పాల్గొన్న కమల్ హాసన్ మీద ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. అయితే, అది కమల్ హాసన్‌కు తగలలేదు. మరికొందరు కూడా కమల్ మీదకు చెప్పులు విసిరారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు.
ఈ దాడిలో పోలీసులు బీజేపీ కార్యకర్తలతో పాటు హనుమ సేన కార్యకర్తలపై కూడా కేసు నమోదు చేశారు. గాడ్సేపై చేసిన వ్యాఖ్యలకు గాను కమల్ హాసన్ మీద చర్యలు తీసుకోవాలంటూ పలు హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. కమల్ హాసన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు కూడా చేశారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కమల్ హాసన్ మీద చెప్పుల దాడి జరిగింది. అయితే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాత్రం కమల్ ను పూర్తిగా వెనకేసుకు వచ్చారు. గాంధీని చంపిన గాడ్సే నీచ్ కాక..మంచి వాడు అవుతాడా? అని ప్రశ్నించారు.