పవన్ మంగళగిరిలో ఎందుకు ప్రచారం చేయరు?

Update: 2019-04-09 07:55 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబులపై ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పోటీచేస్తున్న మంగళగిరి, చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో ఎందుకు ప్రచారం చేయటంలేదని ప్రశ్నించారు. కొద్ది కాలం క్రితం నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మాత్రం మౌనంగా ఉంటున్నారు. అసలు నారా లోకేష్, చంద్రబాబు అవినీతిల గురించే ప్రస్తావించటం లేదు. అదే సమయంలో చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ పోటీచేస్తున్న భీమవరం, గాజువాకల్లో ఎందుకు ప్రచారం చేయలేదని ప్రశ్నించారు. మంగళగిరిలో వైసీపీ అభ్యర్ది ఆళ్ల రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే ఆయన కు తన మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తానని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ప్రకటించారు. మంగళగిరిలో జరిగిన భారీ బహిరంగ షభలో ఆయన ప్రసంగించారు.

ఆళ్ల రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే మంగళగిరిలో మీ ఆస్తులను కాపాడతారని, లోకేష్ ను గెలిపిస్తే మీ ఆస్తులు ఏమి అవుతాయో తెలియదని వ్యాఖ్యానించారు. లోకేష్, చంద్రబాబు లు ఎన్నడైనా మంగళగిరికి వచ్చారా అని ఆయన అన్నారు. ఇక్కడి ప్రజలను భూముల సేకరణ పేరుతో ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూశామని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిని ప్రతి కుంభకోణం.. మోసం.. వంచన అన్ని మంగళగిరి కేంద్రంగానే జరిగాయన్నారు. చంద్రబాబును ఓడించాలని రాష్ట్రమంతా నిర్ణయించుకుందని, ఆయన సుపుత్రుడు లోకేష్‌ను కూడా ఓడించాలని వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. చంద్రబాబు, ఆయన పార్టనర్‌.. ఎల్లో మీడియా చేసే కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత నేతకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ప్రకటించారు.

Similar News