ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గానే సాగుతున్నాయి. నేతల మధ్య ఆరోపణలు..ప్రత్యారోపణలు ఒకెత్తు అయితే..అధికారులు కూడా రంగంలోకి దిగుతున్నారు. సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యాన్ని సీఎం చంద్రబాబాబునాయుడు ఏకంగా కోవర్ట్ అని వ్యాఖ్యానించటం పెద్ద దుమారమే రేపింది. ఈ అంశంపై రిటైర్డ్ ఐఏఎస్ లు మంగళవారం నాడు హైదరాబాద్ లో గవర్నర్ నరసింహన్ ను కలసి ఫిర్యాదు చేశారు. సర్వీసులో ఉన్న అధికారులు కూడా ఈ వ్యవహారంపై గరం గరంగా ఉన్నారు. తాజాగా ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏ బీ వెంకటేశ్వరరావు రంగంలోకి వచ్చారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై పరువు నష్టం దావా వేయనున్నట్లు తెలిపారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని..ఇది ఏ మాత్రం సరికాదన్నారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు ఎవరితోనూ వ్యాపార సంబంధాలు లేవని ఆయన తెలిపారు. ఈ ప్రగతి ప్రాజెక్టుతో కూడా తమకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏజెన్సీలు, సంస్థలతో తాను కానీ..తన కుటుంబ సభ్యులు ఎవరూ భాగస్వామ్యం కలిగి లేమన్నారు. విజయసాయిరెడ్డి చేస్తున్న హేయమైన ఆరోపణలను ఖండిస్తున్నట్లు తెలిపారు.