చంద్రబాబు ఊసెత్తని రాహుల్

Update: 2019-03-31 10:57 GMT

కాంగ్రెస్, టీడీపీ ‘ఒప్పందం’ మరోసారి బహిర్గతం అయింది. ఏపీలో ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక్కటంటే ఒక్క మాట చంద్రబాబు సర్కారు గురించి మాట్లాడలేదు. కానీ ప్రత్యేక హోదా విషయంలో ప్రాంతీయ పార్టీలు సరిగా వ్యవహరించలేదని మాత్రం వ్యాఖ్యానించారు. అంతే కానీ నాలుగేళ్ల పాటు మోడీతో కలసి సాగిన చంద్రబాబు గురించి ఒక్కటంటే ఒక్క విమర్శ కూడా చేయలేదు. దీన్ని బట్టి టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య అవగాహన కొనసాగుతుందనే విషయం మరోసారి తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ మరోమారు స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ మేనిఫెస్టోలో కూడా పెడుతున్నామని వెల్లడించారు. విభజన సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా హామీ ఇఛ్చారని..ఈ హామీని అమలు చేయటంలో మోడీ సర్కారు విఫలమైందని ధ్వజమెత్తారు. తాను ప్రధాని నరేంద్రమోడీలా అబద్దాలు చెప్పనని..చేసేదే చెబుతానని వ్యాఖ్యానించారు. దేశంలో పేదరిక నిర్మూలనకు ‘న్యాయ్’ అనే పథకంతో పేదరికంపై సర్జికల్స్ స్ట్రైక్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

రాహుల్ గాంధీ ఆదివారం నాడు కృష్ణా జిల్లాలోని గన్నవరంలో కాంగ్రెస్ భరోసా సభలో రాహుల్ ప్రసంగించారు. పేదల ఖాతాల్లో 15 లక్షల రూపాయలు వేస్తామని మోడీ హామీ ఏమైందని ప్రశ్నించారు. మోడీ సంపన్నుల కోసం ఓ దేశాన్ని...పేదల కోసం ఓ దేశాన్ని సృష్టించారని విమర్శించారు. జీఎస్టీతో పారిశ్రామిక రంగాన్ని దెబ్బతీశారని..వ్యాపారులను గందరగోళంలోకి నెట్టారని ధ్వజమెత్తారు. నోట్ల రద్దుతో దేశంలో ఎంతో మంది ఉపాధి కోల్పోయారని తెలిపారు. పేదలకు కనీస ఆదాయం పథకం కింద నెలకు 12 వేల కంటే తక్కువ ఆదాయం ఉన్న వారికి ఏటా 72 వేల రూపాయల లెక్కన చెల్లిస్తామని ప్రకటించారు. ఈ పథకంతో దేశంలోని 25 కోట్ల మంది ప్రయోజనం పొందుతారని తెలిపారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు కొత్త భూసేకరణ చట్టాన్ని తెచ్చామన్నారు.

Similar News