కొత్త తరహా రాజకీయం అంటే ‘ఫ్యామిలీ ప్యాక్’లేనా పవన్ ?

Update: 2019-03-20 10:45 GMT

పవన్ కళ్యాణ్ రాజకీయం ఏ రకంగా తేడా?. టీడీపీకి, వైసీపీ రాజకీయాలకు భిన్నంగా జనసేనలో ఏముంది?. ఎక్కడుంది?. జనసేన కొత్త తరహా రాజకీయం చేస్తుంది. రాజకీయాలను మారుస్తుంది అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలుమార్లు ప్రకటించారు. సీఎంగా పని చేసిన వ్యక్తి చనిపోతే ఆయన కొడుకు సీఎం కావాలా?. సీఎం తనయుడు మంత్రి కావాలా? అంటూ ప్రశ్నలు వేశారు. ఓకే. మరి పార్టీ అధినేత అన్నకే నరసాపురం ఎంపీ టిక్కెట్ ఇవ్వాలా?. నరసాపురం టిక్కెట్ పై పోటీచేసేందుకు జనసేనలో ఎంపీ అభ్యర్ధులు ఎవరూ లేరా?. అసలు నాగబాబు పార్టీలో చేరకముందే ఆయన పార్టీలో చేరుతున్నారు...చేరుతున్న ఆయనకు నరసాపురం ఎంపీ టిక్కెట్ ఇస్తున్నట్లు జనసేన ప్రకటింది. నాగబాబు కాదు ఎవరైనా..ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు. అలా పోటీ చేయటంపై ఎవరికీ అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం కూడా లేదు. కానీ పవన్ కళ్యాణ్ చెప్పిన దానికి చేస్తున్న దానికి మధ్య తేడాపైనే ఈ చర్చ అంతా. సామాన్యులకు రాజకీయం అక్కర్లేదా?. సీట్లు అక్కర్లేదా అంటూ మరో ప్రాంతీయ పార్టీలో ‘ఫ్యామిలీ ప్యాక్’ రాజకీయాలకు తెరతీశారు పవన్.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కరే ఏకంగా రెండు చోట్ల నుంచి పోటీ చేయనున్నారు. పార్టీ అధ్యక్షుడే గెలుపుపై నమ్మకం లేక రెండు చోట్ల పోటీ చేయటం అంటే ఆయన లీడర్లు..క్యాడర్ కు ఎలాంటి సంకేతాలు పంపుతున్నట్లు?. జనసేనలో జరిగిన టిక్కెట్ల కేటాయింపులు...పొత్తులపై కూడా పలు విమర్శలు విన్పిస్తున్నాయి. అసలు ఏపీలో ఉనికే లేని బీఎస్పీకి ఏకంగా మూడు ఎంపీ సీట్లు..21 అసెంబ్లీ సీట్లు కేటాయించటం వెనక కూడా ‘లోపాయికారీ రాజకీయం’ తప్ప...నిక్కచ్చి రాజకీయం లేదనే విమర్శలు ఉన్నాయి. ఏపీలో బరిలో ఉన్న అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలు టిక్కెట్లు ఖరారు చేసుకుని ప్రచారం హోరెత్తిస్తుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఇంత వరకూ అసలు ఎన్నికల ప్రచారమే ప్రారంభించలేదు. దీని వెనక మతలబు ఏమిటి?. అభ్యర్ధులను నిలబెట్టిన పార్టీ అధ్యక్షుడు వారి గెలుపు కోసం ప్రచారం చేయరా?. ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే జనసేనపై వస్తున్న విమర్శలకు మరింత బలం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

 

 

 

 

Similar News