ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘దావూద్ ఇబ్రహీం లో ఒకటే ఉగ్రవాద నేరకోణం. నీరబ్ మోదిలో ఒకటే బ్యాంక్ చీటింగ్ నేర కోణం. హర్షద్ మెహతా ది ఒకటే ఆర్ధిక నేరకోణం. ఛార్లెస్ శోభరాజ్ ది ఒకటే హింసావాద నేర కోణం. ఈ నేర కోణాలన్నీ ఉన్న కరడుకట్టిన క్రిమినల్ జగన్మోహన్ రెడ్డి. చిన్నప్పుడే చెడ్డదారి పట్టిన ఆకతాయి బిడ్డ జగన్.’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్ధిక నేరకోణం,హింసావాద నేరకోణం,ఉగ్రవాద నేరకోణం,విధ్వంసవాద నేరకోణం...జగన్మోహన్ రెడ్డిలో లేని నేరకోణం లేదంటూ ధ్వజమెత్తారు. పార్టీ నేతలతో శనివారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘టిడిపి గెలుపు ఏకపక్షం కావడంతో ప్రతిపక్షానికి దిమ్మతిరుగుతోంది. అరాచకాలను రెచ్చగొట్టే నీచ ప్రయత్నాలు చేస్తున్నారు.
జగన్ అరాచక శక్తి అనడానికి అఫిడవిట్ కేసులే నిదర్శనం. 48పేజీలలో 31కేసులు జగన్ నేరచరిత్రకు రుజువులు. దేశంలో ఎవరి అఫిడవిట్ లోనూ ఇన్ని కేసులు ఉండవు. చిన్నాన్న హత్యలోనూ రాజకీయ లాభాలు చూడటం నీచాతినీచం. బిడ్డను ఇచ్చి పెళ్లి చేయడానికి కూడా అనేకం ఆలోచిస్తాం. చదువు-సంస్కారం, ఉద్యోగం చూసి పిల్లనిస్తాం. ఇల్లు అద్దెకు ఇచ్చేముందు అనేకం ఆలోచించి ఇస్తాం. మరి మన ఓటేసే ముందు ఎన్ని ఆలోచించాలి. 31కేసులున్న వాడికి ఎవరైనా ఓటేస్తారా..? అరాచకాల పార్టీకి ఎవరైనా ఓటేస్తారా..? హత్యారాజకీయాలు చేసేవారికి ఎవరైనా ఓటేస్తారా..? హింసావిధ్వంసాలకు పాల్పడేవాళ్లకు ఎవరైనా ఓటేస్తారా..?’ అని ప్రశ్నించారు.