చంద్రబాబు ‘పాత సామాన్ల’ అమ్మకం

Update: 2019-03-27 04:35 GMT

రియల్ ఎస్టేట్ లో డబుల్ రిజిస్ట్రేషన్లు ఉంటాయి కొన్ని చోట్ల. ఒకటే స్థలాన్ని ఇద్దరు..ముగ్గురికి అమ్మి సొమ్ము చేసుకోవాలని చూస్తుంటారు. తర్వాత అయినా ఆ మోసాలు బయటపడతాయి. రాజకీయాల్లో కూడా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఇప్పుడు అచ్చం అదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు కన్పిస్తోంది. రియల్ ఎస్టేట్ రంగానికి..రాజకీయానికి సంబంధం ఏంది అంటారా?. అక్కడే ఉంది అసలు విషయం. గత ఎన్నికల్లో చంద్రబాబు అమ్మిన ఐటెం పేరు ‘అనుభవం’. మరో ఐటెం ‘బాబు వస్తేనే జాబు వస్తుంది.’ రకరకాల కారణాలతో పాటు ఈ రెండు ఐటెంలు కూడా అప్పట్లో పనిచేశాయి. అందుకే అతి తక్కువ ఓట్ల తేడాతో అయినా సరే అధికారం దక్కించుకోగలిగారు. అంత వరకూ బాగానే ఉంది. కానీ గత ఎన్నికల్లో అమ్మిన ఐటెంలు అయిన ‘అనుభవం. బాబు వస్తేనే జాబ్’ అనే వస్తువులను ఓటర్లు ఎన్నిసార్లు కొంటారు. ఒక సారి కొనుక్కుని చూసిన తర్వాత ఆ ఐటెం పని తీరు ఏంటో తెలిసిపోతుంది. కాబట్టి దానిపై ప్రజలకు క్లారిటీ వస్తుంది. మళ్లీ మళ్లీ ఎవరైనా అదే వస్తువును కొనుక్కోవాలని చూస్తారా?. అంటే లేదనే చెబుతున్నాయి రాజకీయ వర్గాలు.

ఈ ఎన్నికల్లో కూడా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుతోపాటు మంత్రి నారా లోకేష్ కూడా డ్రైవింగ్ తెలిసిన వారికే స్టీరింగ్ ఇవ్వాలని..అనుభవం ఉన్న వారికే అధికారం అప్పగించాలని పదే పదే కోరుతున్నారు. ఐదేళ్ల పాలన తర్వాత కూడా చంద్రబాబునాయుడు చేసినవి చెప్పుకోవటానికి ఏమీ లేక మళ్ళీ ఈ నినాదాలనే ఎంచుకున్నారా?. ఎన్నికల ముందు హడావుడిగా ప్రకటించిన సంక్షేమ పథకాలను ప్రజలు నమ్మరని భయపడుతున్నారా?. ఎందుకు ఇప్పుడు మళ్ళీ పాత నినాదాన్నే తెరపైకి తెస్తున్నారు. ఒక సారి వర్కవుట్ అయినా ఫార్ములా పదే పదే పనిచేస్తుంది అనుకోవటం కూడా భ్రమే అవుతుంది. మరి చంద్రబాబు చేపట్టిన ఈ పాత సామాన్ల అమ్మకం ఎంత వరకు ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాల్సిందే.

Similar News