వడ్డీ రేట్లలో మార్పుల్లేవ్

ఈ ఏడాదిలో మొత్తం 115 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లలో కోతలు విధించిన రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా (ఆర్ బీఐ) ఈ సారి మాత్రం ఎలాంటి మార్పులు చేయకుండా వదిలేసింది. ద్రవ్యోల్బణం ఆర్ బిఐ అంచనా వేసిన దాని కంటే చాలా ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 4 శాతం కొనసాగనుంది. రివర్స్ రెపో 3.35 శాతం వద్ద, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 4.2 శాతంగా అమలుకానున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21)లో దేశ జీడీపీ 9.5 శాతం క్షీణించే వీలున్నట్లు ఆర్‌బీఐ తాజాగా అంచనా వేసింది. క్యూ4(జనవరి-మార్చి21) నాటికి ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాట పట్టేవీలున్నట్లు తెలిపింది.
వ్యవసాయం, కన్జూమర్ గూడ్స్, పవర్, ఫార్మా రంగాలు వేగంగా రికవర్ అయ్యే వీలున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. కోవిడ్-19 ప్రభావంతో ఆర్థిక పురోగతి మైనస్‌లోకి జారడంతోపాటు.. రిటైల్ ధరలు లక్ష్యానికంటే ఎగువనే కొనసాగుతున్నాయి. ఆరు నెలలుగా వినియోగ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) 6 శాతంకంటే అధికంగా నమోదవుతోంది. 4 శాతం స్థాయిలో సీపీఐను కట్టడి చేయాలన్నది ఆర్‌బీఐ లక్ష్యంకాగా.. ఆహార ధరలు అధిక స్థాయిలలో కొనసాగడం ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.