Telugu Gateway
Latest News

టీఆర్ పీ స్కామ్ లో కొత్త ట్విస్ట్

టీఆర్ పీ స్కామ్ లో కొత్త ట్విస్ట్
X

ఎఫ్ఐఆర్ లో ఇండియా టుడే ఛానల్ పేరు

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన టీఆర్ పీ స్కామ్ లో కొత్త ట్విస్ట్. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో ఇండియా టుడే ఛానల్ పేరు కూడా ఉంది. అయితే గురువారం నాడు ముంబయ్ పోలీసు కమిషనర్ వెల్లడించిన వివరాల్లో అసలు ఇండియా టుడే పేరే బయటకు రాలేదు. ఫోకస్ అంతా కూడా రెండు మరాఠీ ఛానళ్ళతోపాటు రిపబ్లిక్ టీవీపై పెట్టారు. అయితే ఈ అంశంపై ముంబయ్ పోలీసు జాయింట్ కమిషనర్ మిలింద్ బరంబీ ఇండియా టుడే చానల్ తో మాట్లాడుతూ ఎఫ్ఐఆర్ లో ఇండియా టుడే ఛానల్ పేరు ఉన్న మాట వాస్తవమే అని..అయితే తమ విచారణలో ఈ ఛానల్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. అయితే ఎఫ్ఐఆర్ కు అనుగుణంగా విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. అయితే రిపబ్లిక్ టీవీకి సంబంధించి టీఆర్ పీ మోసాలు..డేటాలో తేడాలు..బార్క్ మీటర్లు ఉన్న ప్రాంతంలోని ఇళ్ళకు డబ్బు చెల్లింపులు వంటి అంశాలపై ఆధారాలు దొరికినట్లు పోలీసులు చెబుతున్నారు. ఛానల్ పెట్టిన అనతికాలంలో రిపబ్లిక్ టీవీ రేటింగ్స్ విషయంలో మొదటి స్థానంలోకి వెళ్లింది.

ఇది మిగతా పోటీ ఛానళ్లకు ఏ మాత్రం రుచించలేదు. దీంతో ముంబయ్ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ టీఆర్ పీ స్కామ్ అని ప్రకటించిన వెంటనే అందరూ రిపబ్లిక్ పై ఎటాక్ ప్రారంభించారు. టీఆర్పీ స్కామ్ కంటే ఇప్పుడు ఇది జాతీయ ఛానళ్లలో మీడియా వార్ గా మారిపోయినట్లు కన్పిస్తోంది. అయితే రిపబ్లిక్ టీవీ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ముంబయ్ పోలీసు కమిషనర్ తోపాటు చానళ్లపై పరువు నష్టం దావా వేస్తామని..తాము బహిర్గతం చేస్తున్న నిజాలను జీర్ణించుకోలేకే ఈ దాడి అని ఆ ఛానల్ చీఫ్ ఎడిటర్ అర్ణబ్ గోస్వామి ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. మరి ఈ విచారణ ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it