జెఈఈ టాపర్ చిరాగ్ ఫలోర్

ఢిల్లీలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) సోమవార నాడు జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జెఈఈ) అడ్వాన్స్ డ్ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో పూణేకు చెందిన చిరాగ్ ఫలోర్ 396కు గాను 352 మార్కులు సాధించి అఖిల భారతస్థాయిలో టాపర్ గా నిలిచాడు. గత నెల 28, 29 తేదీల్లో జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. జేఈఈ అడ్వాన్స్‌డ్ అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.inలో విద్యార్థులు రిజల్ట్స్ చూసుకోవచ్చని ప్రకటించారు.
దేశ వ్యాప్తంగా ఐఐటీల్లోని బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకై నిర్వహించే ఈ పరీక్షకు లక్షన్నర మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. పేపర్-1కు 1,51,311 మంది హాజరు అవగా, 1,50,900 మంది పేపర్ 2 పరీక్ష రాశారు. ఈ ప్రతిష్టాత్మక పరీక్షల్లో 352/396 స్కోర్ సాధించిన చిరాగ్ ఫలోర్ టాపర్‌గా నిలవగా, 315 మార్కులు సాధించిన కనిష్క మిట్టల్ బాలికల్లో ప్రథమ స్థానం సంపాదించారు. ఈనెల 6 (మంగళవారం) నుంచి ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు ఉమ్మడి కౌన్సెలింగ్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు.