Telugu Gateway
Latest News

విదేశీ వ్యాక్సిన్లపై కేంద్రం కీలక ప్రకటన

విదేశీ వ్యాక్సిన్లపై కేంద్రం కీలక ప్రకటన
X

సమగ్ర అధ్యయనం తర్వాతే దేశంలోకి విదేశీ వ్యాక్సిన్లను అనుమతిస్తామని కేంద్రం తేల్చిచెప్పింది. వ్యాక్సిన్ ఏ మేరకు సురక్షితం, విదేశాల్లో చేసిన పరీక్షలు ఎంత మేరకు విజయవంతం అయ్యాయి వంటి అంశాలను పరిశీలించి.. దేశంలో అనుసరించాల్సిన పక్కా నిబంధనలు పాటించిన తర్వాతే వాటిని దేశంలోకి అనుమతిస్తామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. విదేశాల్లో పలు వ్యాక్సిన్ల అభివృద్ధి తుది దశకు చేరుకుంటున్న సమయంలో కేంద్రం నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా భారతీయుల విషయంలో విదేశీ వ్యాక్సిన్ల భద్రత, రోగ నిరోధకతను నిర్ధారించే బ్రిడ్జింగ్ అధ్యయనాలు సంతృప్తికరంగా ఉంటేనే వీటి విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే విదేశీ వ్యాక్సిన్లకు సంబంధించిన పరీక్షల ప్రక్రియను అతి త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కు సంబంధించి భారత్ లో సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ప్రయోగాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్ మూడవ దశ ప్రయోగాలు కూడా తుది దశకు వచ్చాయి.

రష్యాకు చెందిన కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ ను భారత్ లో మూడవ దశ ప్రయోగాలకు అనుమతించే విషయంలో ఇంత వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేన్నారు. ఇదిలా ఉంటే భారత్ కు చెందిన ప్రముఖ వ్యాక్సిన్ల తయారీ సంస్థ కరోనా వ్యాక్సిన్ విషయంలో మరో కీలక అడుగు వేసింది. కోవాగ్జిన్ వ్యాక్సిన్ లో అల్ హైడ్రాక్సిక్విమ్-2 అనే అనుబంధ ఔషధాన్ని వినియోగిస్తున్నట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది. దీని వల్ల రోగనిరోధక శక్తి మరింత పెరుగుతుందని తెలిపారు. దీని వల్ల వైరస్ నుంచి ఎక్కువ కాలం రక్షణ లబిస్తుందని తెలిపారు. ఈ ఔషధం కోసం భారత్ బయోటెక్ వైరో వ్యాక్స్ అనే సంస్థతో ఒప్పందం చేసుకుంది. భారత్ బయోటక్ రెండవ దశ క్లినికల్ ట్రయల్స్ ను పూర్తి చేసుకుని త్వరలోనే మూడవ దశలోకి అడుగుపెట్టనుంది.

Next Story
Share it