Telugu Gateway
Latest News

మోడీ ‘ఎయిర్ ఇండియా వన్’ 777 బోయింగ్ వచ్చేసింది

మోడీ ‘ఎయిర్ ఇండియా వన్’ 777 బోయింగ్ వచ్చేసింది
X

ఎయిర్ ఫోర్స్ వన్ తరహాలో వివిఐపిల విమానాలు

ఎయిర్ ఫోర్స్ వన్. అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన విమానం. అలాగే ఇప్పుఢు భారత ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి వివిఐపిల ఉపయోగం కోసం ఎయిర్ ఇండియా వన్ కూడా వచ్చేసింది. ఈ బోయింగ్ 777 ఎయిర్ క్రాఫ్ట్ లో ఎయిర్ ఫోర్స్ వన్ తరహాలోనే అన్ని రక్షణ చర్యలు, అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. వివిఐపిల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన బోయింగ్ 777 విమానం గురువారం నాడు అమెరికాలోని డల్లాస్ నుంచి ఢిల్లీ చేరుకుంది. ఈ విమానంలో లేజర్ ఆధారిత డిఫెన్స్ సిస్టం ఉంటుంది. అంతే కాకుండా ఆఫీస్ సమావేశ మందిరాలు, అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు అందుబాటులో ఉంటాయి. ఈ విమానం ఏకబిగిన 17 గంటల పాటు ప్రయాణం చేయగలదు. ఎయిర్ ఇండియా వన్ విమానానికి సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్(ఎస్ పీఎస్) ఉంటుంది. మిస్సైల్స్ నుంచి వచ్చే ముప్పును ఇది అరికడుతుంది.

వాస్తవానికి ఈ విమానం ఈ ఏడాది జులైలోనే అందాల్సి ఉన్నా కోవిడ్ తోపాటు సాంకేతిక కారణాల వల్ల భారత్ చేరుకోవటంలో జాప్యం జరిగింది.భారత్ మొత్తం రెండు 777 బోయింగ్ విమానాలకు ఆర్డర్ ఇఛ్చింది. త్వరలోనే రెండవ బోయింగ్ కూడా అందుబాటులోకి రానుంది. వాస్తవానికి ఎయిర్ ఇండియా కమర్షియల్ విమానాలు గా ఉన్న వీటిని వివిఐపిల ప్రయాణాలకు అనుగుణంగా మార్చేందుకు బోయింగ్ కు అప్పగించారు. బోయింగ్ ల కొనుగోలు..వీటిని రక్షణ చర్యలతోపాటు అత్యాధునికంగా తీర్చిదిద్దేందుకు మొత్తం 8400 కోట్ల రూపాయలు వ్యయం అయినట్లు అంచనా. ఈ విమానాలను ఎయిర్ ఇండియా పైలట్లు కాకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) పైలట్లు నడపనున్నారు. ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్ఎల్ ) వీటి నిర్వహణను చూసుకోనుంది.

Next Story
Share it