డొనాల్డ్ ట్రంప్ కు విషపు పార్శిల్..కలకలం

అమెరికాలో కలకలం. సాక్ష్యాత్తూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నే టార్గెట్ చేశారు. నవంబర్ లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో జరిగిన ఈ ఘటన మరింత కలకలం రేపుతోంది. డొనాల్డ్ ట్రంప్ పై విష ప్రయోగానికి కొంత మంది కుట్ర పన్నారు. శనివారం రాత్రి అధ్యక్షుడి అధికార నివాసమైన వైట్‌హౌస్‌కు విషంతో కూడిన ఓ పార్సిల్‌ను పంపారు. దీనిపై దేశ అత్యున్నత ఫెడరల్ దర్యాప్తు సంస్థ (ఎఫ్‌బీఐ)తో పాటు మరికొన్ని బృందాలు విచారణ చేపడుతున్నాయి. తనిఖీ కేంద్రంలోనే దీన్ని గుర్తించి అక్కడే నిలిపివేశారు. పార్సిల్‌లో ఉన్నది రిసిన్ అనే అత్యంత విషపూరితమైన పదార్థంగా గుర్తించారు.
ఇది అత్యంత ప్రమాదకరమైన పదార్థమని, దానిని తీసుకున్న 30 గంటలలోపు మనిషి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్నట్లు వైద్యులు భావిస్తున్నారు. అయితే దీనికి ఇంత వరకు విరుగుడు లేకపోవటం విశేషం. ఈ విషపు పార్సిల్ కెనడా నుంచి వచ్చినట్లు వైట్‌హౌస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. తాజా ఘటనతో ట్రంప్ భద్రతా బృందం మరింత అప్రమత్తమైంది.