Telugu Gateway
Latest News

స్పైస్ జెట్ ‘డ్రోన్ సర్వీసులు’..ట్రయల్స్ కు డీజీసీఏ అనుమతి

స్పైస్ జెట్ ‘డ్రోన్ సర్వీసులు’..ట్రయల్స్ కు డీజీసీఏ అనుమతి
X

దేశంలోని ప్రముఖ చౌకధరల ఎయిర్ లైన్స్ స్పైస్ జెట్ ‘డ్రోన్ సేవలు’ ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఈ ఎయిర్ లైన్స్ కు చెందిన కార్గో విభాగం స్పైస్ ఎక్స్ ప్రెస్ డ్రోన్ ట్రయల్స్ నిర్వహణ కోసం డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి అనుమతి పొందింది. ఈ ట్రయల్ రన్స్ పూర్తి అయిన తర్వాత మెడికల్, ఫార్మా ఉత్పత్తులతోపాటు ఈ కామర్స్ కు చెందిన నిత్యావసర వస్తువులను సరఫరా చేయనుంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు ఈ సేవలు అందించనున్నట్లు వెల్లడించింది. 2020-21 ఆర్ధిక సంవత్సరం తొలి మూడు నెలల కాలానికి అంటే 2020జూన్ తో ముగిసిన మూడు నెలల పలితాల వెల్లడి సందర్భంగా ఈ డ్రోన్ సర్వీసుల విషయాన్ని కంపెనీ వెల్లడించింది. అయితే ఈ కాలంలో కంపెనీ భారీ నష్టాలను మూటకట్టుకుంది.

కోవిడ్ 19 కారణంగా విమాన సర్వీసులు ఎక్కడికి అక్కడే నిలిచిపోవటంతో ఏవియేషన్ పరిశ్రమ దారుణంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీంతో 2020 జూన్ తో ముగిసిన మూడు నెలల కాలానికి కంపెనీ 593 కోట్ల రూపాయల నికర నష్టాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం 261.7 కోట్ల రూపాయలుగా ఉంది. ఇదే కాలంలో నిర్వహణ ఆదాయం కూడా 3002 కోట్ల రూపాయల నుంచి 514.7 కోట్ల రూపాయలకు తగ్గింది. కార్గో హ్యాండ్లింగ్ లో మాత్రం రెట్టింపు వృద్ధి సాధించామని తెలిపింది. వ్యయాలను తగ్గించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.

Next Story
Share it