Telugu Gateway
Latest News

రిలయన్స్ రిటైల్ లో 1.28 శాతం వాటాకు 5550 కోట్లు

రిలయన్స్ రిటైల్ లో 1.28 శాతం వాటాకు 5550 కోట్లు
X

జియో ఫ్లాట్ ఫామ్స్ లో వాటాల విక్రయం పూర్తి అయింది. ఈ వాటాల విక్రయం ద్వారా లక్ష కోట్ల రూపాయలపైనే పెట్టుబడులు సాధించిన ముకేష్ అంబానీ ఇప్పుడు రిలయన్స్ రిటైల్ వాటాల విక్రయం ప్రారంభించారు. తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ సంస్థ కేకేఆర్ రిలయన్స్ రిటైల్ లో పెట్టుబడి పెట్టాడానికి ఒప్పందం చేసుకుంది. ఇదే కేకేఆర్ రిలయన్స్ జియోలోనూ 11367 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు రిటైల్ రంగంలోకి అడుగుపెట్టింది. రిలయన్స్‌ రిటైల్‌లో 1.28 శాతం వాటాను కేకేఆర్‌కు విక్రయించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలియజేసింది.

డీల్‌ విలువను రూ. 5,550 కోట్లుగా వెల్లడించింది. దీంతో రిలయన్స్‌ రిటైల్‌ ప్రీమనీ ఈక్విటీ విలువ రూ. 4.21 లక్షల కోట్లకు చేరినట్లు తెలియజేసింది. రిలయన్స్‌ రిటైల్‌లో పెట్టుబడిదారుగా కేకేఆర్‌కు ఆహ్వానం పలుకుతున్నట్లు డీల్‌ సందర్భంగా ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ పేర్కొన్నారు. రిటైల్‌ వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టడం ద్వారా దేశీ వినియోగదారులకు లబ్ది చేకూర్చనున్నట్లు తెలియజేశారు. ఇప్పటికే రిలయన్స్‌ రిటైల్‌లో పీఈ దిగ్గజం సిల్వర్‌ లేక్‌ పార్టనర్స్‌ 1.75 శాతం వాటాను కొనుగోలు చేసిన విషయం విదితమే. ఇందుకు రూ. 7,500 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడు కేకేఆర్ ది రెండవ పెట్టుబడి.

Next Story
Share it