Telugu Gateway
Latest News

ఒక్క భారత్ కే వ్యాక్సిన్ కోసం 80, 000 కోట్లు కావాలి

ఒక్క భారత్ కే వ్యాక్సిన్ కోసం 80, 000 కోట్లు కావాలి
X

అందుకు దేశం రెడీనా?

క్విక్ క్వశ్చన్ అంటూ ప్రశ్నించిన అదర్ పూనావాలా?

అన్ని పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకుని కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావటం ఇప్పుడు ప్రపంచం ముందున్న అతి పెద్ద సవాల్. ఏ వ్యాక్సిన్ వచ్చినా దానిపై ఎంత ఒత్తిడి ఉంటుందో తెలిసిందే. ఎందుకంటే ఈ మహమ్మారి నుంచి తమ ప్రజలను రక్షించేందుకు అగ్రదేశాలు అన్నీ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. వ్యాక్సిన్ రావటం ఒకెత్తు అయితే..వచ్చాక వ్యాక్సిన్ దేశంలోని పౌరులు అందరికీ అందేలా చేయటం ఓ పెద్ద సవాల్ గా మారనుంది. ఒక్క భారత్ లో దేశంలోని పౌరులు అందరికీ ఈ వ్యాక్సిన్ అందజేయాలంటే 80 వేల కోట్ల రూపాయలు అవుతుందని సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈవో అదర్ పూనావాలా వెల్లడించారు.

భారత్ ఇందుకు సిద్ధంగా ఉందా?. 80 వేల కోట్ల రూపాయలు వ్యాక్సిన్ కోసం సమకూర్చుకోగలమా అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు అదర్ పూనావాలా ట్వీట్ చేస్తూ దీన్ని పీఎంవోకు కూడా ట్యాగ్ చేశారు. అదర్ పూనావాలా అంచనాల ప్రకారం చూస్తే దేశంలోని పౌరులందరికీ వ్యాక్సిన్ అందటానికి ఎంత సమయం పడుతుందో చెప్పటం కష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దేశీయ, విదేశీ ఫార్మా కంపెనీలను సంప్రదించి టీకాను కొనుగోలు చేసే అంశంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకతను వివరించేందుకే తాను ఈ ప్రశ్న అడిగినట్లు పూనావాలా పేర్కొన్నారు. ఎస్ఐఐ భారత్ లో ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Next Story
Share it