Telugu Gateway
Latest News

హాథ్రాస్ రేప్ ఘటనపై సిట్ ఏర్పాటు

హాథ్రాస్ రేప్  ఘటనపై సిట్ ఏర్పాటు
X

ఉత్తరప్రదేశ్ లోని హాథ్రాస్ జిల్లాలో నిర్భయ తరహాలో జరిగిన రేప్ ఘటనపై ఉత్తరప్రదేశ్ సర్కారు స్పందించింది. ఈ ఘటనపై విచారణకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను ఏర్పాటు చేసింది. ముగ్గురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేసి..వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. హాథ్రాస్ రేప్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రెండు వారాల క్రితం 19 ఏళ్ల దళిత యువతిని నలుగురు అగ్రవర్ణ యువకులు అత్యంత దారుణంగా గాయపర్చి, పాశవికంగా సామూహిక అత్యాచారం చేశారు. ఆ యువతి చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీలోని సఫ్దర్‌ జంగ్‌ ఆసుపత్రిలో మరణించింది. దేశవ్యాప్తంగా నిరసనలకు, నిర్భయ చట్టానికి కారణమైన 8 ఏళ్ల క్రితం నాటి నిర్భయ అత్యాచార ఘటనను ఈ దారుణం గుర్తుకు తెచ్చింది. దళిత యువతి మృతిపై పౌర సమాజ కార్యకర్తలు, దళిత సంఘాలు, భీమ్‌ ఆర్మీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ తదితర పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. యూపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించాయి. ఢిల్లీలోని సఫ్దర్‌ జంగ్‌ ఆసుపత్రి వెలుపల భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ నాయకత్వంలో వేలాది మంది ధర్నాకు దిగారు.

ఆ దళిత యువతికి న్యాయం చేయాలని, దోషులను బహిరంగంగా ఉరి తీయాలని నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా దళితులంతా వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఆజాద్‌ పిలుపునిచ్చారు. ఆటవిక రాజ్యం నడుస్తున్న యూపీలో మరో దళిత యువతి బలి అయిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.సందీప్, రాము, లవ్‌కుశ్, రవి తనపై అత్యాచారం చేశారని, వారిని అడ్డుకుంటుండగా, గట్టిగా గొంతు నులిమారని, అప్పుడు నాలుక తెగిందని బాధిత యువతి మెజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో వివరించింది. బాధిత మహిళను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్‌ కు తరలించి మెరుగైన చికిత్స అందించకుండా.. పరిస్థితి పూర్తిగా విషమించిన తరువాత, సోమవారం సఫ్దర్‌ జంగ్‌ ఆసుపత్రికి తరలించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.

Next Story
Share it