Telugu Gateway
Andhra Pradesh

రైతుకు విద్యుత్ ఎప్పటికి ఉచితమే

రైతుకు విద్యుత్ ఎప్పటికి ఉచితమే
X

శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు...వచ్చే ఏప్రిల్ నుంచి రాష్ట్రమంతటా

మంత్రివర్గంలో నగదు బదిలీకి ఆమోదం

ఏపీ కేబికేట్ లో ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి నగదు బదిలీ అంశంపై విస్తృత చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు అంశాలను ప్రస్తావించారు. ఈ విషయంలో రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..రైతుకు అందే విద్యుత్తు ఎప్పటికీ ఉచితమే అని స్పష్టం చేశారు. ఒక్క కనెక్షన్‌కూడా తొలగించం, ఉన్న కనెక్షన్లను రెగ్యులరైజ్‌చేస్తామని తెలిపారు. సంస్కరణల వల్ల రైతులపై ఒక్క పైసా కూడా భారం పడదని తెలిపారు. వచ్చే 30-35 సంవత్సరాలు ఉచిత విద్యుత్ పథకానికి ఢోకా లేకుండా చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...‘ కనెక్షన్‌ ఉన్న రైతు పేరుమీద ప్రత్యేక ఖాతా తెరుస్తాం. ఆ ఖాతాలో ప్రభుత్వం డబ్బులు వేస్తుంది. 10వేల మెగావాట్ల సోలార్‌తో పథకాన్ని మరింతగా తీర్చిదిద్దుతాం. పగటిపూట 9 గంటల కరెంటు ఇప్పటికే 89శాతం ఫీడర్లలో అమలు. రబీ సీజన్‌నుంచి పూర్తిగా అమలు. ఉచిత విద్యుత్‌పై పేటెంట్‌ ఒక్క వైఎస్ కే ఉంది. అందుకే పథకానికి ఆయన పేరు. చంద్రబాబు ఉచిత విద్యుత్తు సాధ్యంకాదన్నారు.

కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవడమే అన్నారు. సుమారు 8వేల కోట్లు ఉచిత విద్యుత్తు బకాయిలుపెట్టారు. మనం వచ్చాక బకాయిలు తీర్చాం. 1700 కోట్లతో ఫీడర్లను అప్‌గ్రేడేషన్‌ చేశాం. నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం. చివరకు బషీర్‌బాగ్‌లో కాల్పులకు దిగిన చరిత్ర చంద్రబాబుది. నాన్న ఈ పథకాన్ని తీసుకురావడమే కాక, రైతులు చెల్లించాల్సిన బకాయిలను మాఫీ చేస్తూ ప్రమాణస్వీకారం రోజు ఫైల్‌పై సంతకాలు చేశారు. ఆతర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఉచిత విద్యుత్‌ పథకాన్ని నీరుగార్చాయి. పగటిపూట 9 గంటల పాటు కరెంటు ఇచ్చే పరిస్థితులే లేవు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశీలన చేస్తే దాదాపు 40శాతం ఫీడర్లలో పగటిపూట 9 గంటలపాటు కరెంటు ఇవ్వడానికి మౌలిక సదుపాయాలే లేవు. ఈ పరిస్థితులు మార్చడానికి, ఫీడర్లలో ఏర్పాటు, అప్‌గ్రడేషన్‌ పనులకోసం రూ.1700 కోట్లు కేటాయించాం. దీనివల్ల నడుస్తున్న ఖరీఫ్‌ సీజన్‌కు 89శాతం ఫీడర్లలో పగటిపూటే 9 గంటలపాటు ఉచితంగా ఇస్తున్నాం. మిగిలిన చోట్ల కూడా వేగంగా పనులు పూర్తిచేసి రబీనాటికి 9 గంటలపాటు పగటిపూటే కరెంటు ఇస్తాం. యూనిట్‌ కరెంటు రూ.2.5లకే ప్రభుత్వానికి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాం. తద్వారా ప్రభుత్వానికి భారం తగ్గుతుంది, అంతేకాక ఉచిత విద్యుత్‌ పథకం స్థిరంగా, నిరంతరాయంగా కొనసాగుతుంది.

రైతులకోసమే ఈసోలార్‌ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నాం. అంతేకాదు కొత్తగా తీసుకొస్తున్న సంస్కరణల వల్ల ఉచిత విద్యుత్తు రూపేణా ఎంత వాడుతున్నాం, ఎంత ఖర్చు చేస్తున్నామో తెలుస్తుంది. దీనివల్ల జవాబుదారీతనం, బాధ్యత పెరుగుతాయి. అధికారులకు కూడా రైతుల పట్ల జవాబుదారీతనం పెరుగుతుంది. ప్రతినెలా రైతుల ఖాతాలకు డబ్బు చేరుతుంది. అదే డబ్బు నేరుగా డిస్కంలకు వెళుతుంది. దీనివల్ల చంద్రబాబు ప్రభుత్వంలా బకాయిపెట్టే పరిస్థితులూ ఉండవు. అలాగే స్కీంను నిర్వీర్యం చేసే పరిస్థితులూ రావు. ఉచిత విద్యుత్తకింద డిస్కంలకు బకాయిలుపెట్టే పరిస్థితి లేకుండా ప్రతినెలా రైతులకు డబ్బులు పడతాయి. ఈడబ్బులు డిస్కంలకు వెళతాయి. దీనివల్ల డిస్కంల ఆర్థిక పరిస్థితులు కూడా బాగుంటాయి. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల్లో భాగంగా నాలుగు అంశాలను రాష్ట్రాలు పాటించాల్సి ఉంటుంది అందులో ఉచిత విద్యుత్త పథకంలో సంస్కరణలు ఒకటి. మనసున్న ప్రభుత్వం మనది, రైతుల పక్షపాత ప్రభుత్వం మనది. రైతులకు అన్యాయం జరిగే ప్రశ్నే తలెత్తదు. ఒక్క పైసాకూడా నష్టం జరగదు. ఒక్క కనెక్షన్‌ కూడా రద్దవుతుందన్న మాట రాకూడదని చాలా స్పష్టంగా అధికారులకు చెప్పాం.

విద్యుత్ శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కాల్‌సెంటర్‌ కూడా పెడతాం. రైతులనుంచి వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారు. ఉన్న ప్రతి కనెక్షన్‌ కూడా కొనసాగుతుంది. రైతులు ఎన్నియూనిట్లు కాలిస్తే.. అన్ని యూనిట్లరూ ప్రభుత్వం డబ్బు ఇస్తుంది. మనం మేనిఫెస్టోలో 9 గంటలపాటు ఉచిత విద్యుత్తు పగటిపూట ఇస్తామని హామీ ఇచ్చాం. ఆ మాటను అక్షరాల అమలు చేస్తాం. నాణ్యమైన కరెంటు ఇస్తాం. ప్రతి ఏటా రైతుకు దాదాపు రూ.49,600లకుపైగా ఉచిత విద్యుత్తు కింద ఖర్చు అవుతుంది. ఉచిత విద్యుత్తు పథకంలో సంస్కరణలు, దీనిపై వచ్చే సందేహాలకు పూర్తిస్థాయిలో సమాధానాలు ఇస్తూ అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించాం. గ్రామ సచివాలయాల్లో దీనికి సంబంధించిన సమాచారం ఉంచమని చెప్పాం. శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ప్రాజెక్టుగా అమలు, ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు.’ అని వివరించారు.

Next Story
Share it