Telugu Gateway
Latest News

అమెరికా, చైనాల మధ్య ‘టిక్ టాక్’ వార్

అమెరికా, చైనాల మధ్య ‘టిక్ టాక్’ వార్
X

‘టిక్ టాక్’ యాప్ అమెరికా, చైనాల మధ్య కొత్త తరహా మాటల యుద్ధానికి కారణమవుతోంది. అమ్మేసుకోండి..లేదంటే మూసేసుకోండి అంటూ అమెరికా టిక్ టాక్ యాప్ యాజమాన్య సంస్థ బైట్ డ్యాన్స్ కు హెచ్చరికలు జారీ చేస్తోంది. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో టిక్ టాక్ ను బ్యాన్ చేసేందుకు రెడీ అయ్యారు. కానీ మైక్రోసాఫ్ట్ రంగంలోకి దిగి టిక్ టాక్ ను కొనుగోలు చేయటానికి ఆసక్తి చూపటంలో కథ మారిపోయింది. అయితే దీనికి కూడా ట్రంప్ గడువు పెట్టారు. సెప్టెంబర్ 15లోగా మైక్రోసాఫ్ట్ అయినా మరే సంస్థ అయినా టిక్ టాక్ ను కొనుగోలు చేస్తే ఓకే..లేదంటే బ్యాన్ తప్పదని హెచ్చరిస్తున్నారు. అంతే కాదు..ఈ లావాదేవీ ద్వారా వచ్చే డబ్బులో కొంత భాగం సర్కారుకు కట్టాలని షరతు పెట్టారు. ఈ పరిణామాలపై చైనా మండిపడుతోంది.

అమెరికా బెదిరింపులకు లొంగేదిలేదంటున్న చైనా తాజాగా ఇచ్చిన వార్నింగ్ మరింత అగ్గి రాజేస్తోంది. టిక్‌టాక్‌ విక్రయానికి ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సాగనీయమని చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికారిక వార్తాపత్రిక డైలీ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. టిక్‌టాక్‌ ‘చోరీ’కి అమెరికా యత్నిస్తోందని, దీన్ని అంగీకరించ బోమని హెచ్చరించింది. తమ టెక్నాలజీ కంపెనీలను చేజిక్కించుకోవడానికి అమెరికా యత్నిస్తోందనీ, దీన్ని ప్రతిఘటించి తీరుతామని స్పష్టం చేసింది. అంతేకాదు ట్రంప్ సర్కార్ తీసుకోబోయే ప్రణాళికబద్ద ఆక్రమిత చర్యలపై ప్రతిస్పందించడానికి తమ దగ్గర చాలా మార్గాలున్నాయని కూడా పేర్కొంది. భారత్ లో ఇప్పటికే టిక్ టాక్ ను నిషేధించిన సంగతి తెలిసిందే.

Next Story
Share it