Telugu Gateway
Latest News

ఎయిర్ ఇండియా కొనుగోలు రేసులో టాటా సన్స్

ఎయిర్ ఇండియా కొనుగోలు రేసులో టాటా సన్స్
X

భారీ ఎత్తున అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియా కొనుగోలు రేసులో టాటా గ్రూప్ కూడా నిలవనుంది. ఈ విషయాన్ని గ్రూప్ ధృవీకరించినట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక వెల్లడించింది. కరోనా కారణంగా ఎయిర్ ఇండియా విక్రయం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఆసక్తి ఉన్న సంస్థలు ఆగస్టు 31లోగా తమ బిడ్స్ సమర్పించాల్సి ఉంది. ఇదే చివరి గడువు అని ఇప్పటికే ప్రకటించారు. ఎలాంటి భాగస్వామి లేకుండానే సొంతంగా టాటా సన్స్ బిడ్ సమర్పించే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం టాటా సన్స్ ఈ ఎయిర్ లైన్స్ కు సంబంధించిన వ్యవహారాలపై నిపుణులతో లోతైన అధ్యయనం చేయించుతోంది.

ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత బిడ్డింగ్ పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. వాస్తవానికి ప్రస్తుతం ఎయిర్ ఇండియాగా ఉన్న ఎయిర్ లైన్స్ ను ప్రారంభించింది టాటా సన్సే కావటం విశేషం. 1932లో టాటా సన్స్ టాటా ఎయిర్ లైన్స్ గా ప్రారంభించి..1946 వరకూ సర్వీసులు కొనసాగించారు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారిన తర్వాత పేరును ఎయిర్ ఇండియాగా మార్చారు. మరి ఇప్పుడు ఎయిర్ ఇండియా వ్యవస్థాపక సంస్థ చేతికే వెళుతుందా?. లేక ఇతర సంస్థ చేతికి చిక్కుతుందా అనేది సెప్టెంబర్ నెలలో స్పష్టం అయ్యే అవకాశం ఉంది.

Next Story
Share it