Telugu Gateway
Latest News

ప్రశాంత్ భూషణ్ కు సుప్రీం షాక్

ప్రశాంత్ భూషణ్ కు సుప్రీం షాక్
X

సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయన దోషి అని తేల్చిచెప్పింది. ఆయనకు విధించాల్సిన శిక్షపై ఈ నెల20న వాదనలు విననున్నారు. భారత న్యాయ వ్యవస్థ, సీజేఐపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు శుక్రవారం నాడు తీర్పు వెలువరించింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయన్ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం దోషిగా ప్రకటించింది. ట్విటర్‌ వేదికగా ప్రశాంత్ భూషణ్ గతంలో చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తికి, అంతకుముందు ముందు సీజేఐలుగా ఉన్న మరో నలుగురి గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని కోర్టు స్పష్టంచేసింది. ఇవి కోర్టు ధిక్కరణ కిందకే వస్తాయన్న ధర్మాసనం.. ప్రశాంత్ భూషణ్‌ను దోషిగా తేల్చింది. ఈ కేసుపై ఇవాళ ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిగింది. ప్రశాంత్ భూషణ్ తీరు కోర్టు ధిక్కరణకు సంబంధించిన తీవ్రమైన విషయమని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బీఆర్ గవి, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

కోర్టు ధిక్కరణ చట్టం 1971 ప్రకారం.. ప్రశాంత్ భూషణ్‌కు గరిష్ఠంగా 6 నెలలు జైలు శిక్ష విధించవచ్చు. ఒకవేళ దోషి క్షమాపణలు చెబితే ఎలాంటి శిక్ష లేకుండా వదిలిపెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం ప్రశాంత్ భూషణ్ భారత న్యాయవ్యవస్థ, సుప్రీంకోర్టు, సీజేఐల గురించి వివాదాస్పద ట్వీట్లు చేశారు. వాటిని సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు.. అవి న్యాయ వ్యవస్థను అగౌరవపర్చేలా ఉన్నాయని జులైలో నోటీసులు జారీచేసింది. ఐతే ఫ్రీడమ్ ఆఫ్ థాట్ కోర్టు ధిక్కరణ పరిధిలోకి రాదని ప్రశాంత్ భూషణ్ సమాధానం ఇచ్చారు. ఈ కేసుపై విచారించిన సుప్రీంకోర్టు.. ప్రశాంత్ భూషణ్ ట్వీట్స్ కోర్టు ధిక్కరణ పరిధిలోకి వస్తాయని స్పష్టం చేస్తూ దోషిగా తేల్చింది.

Next Story
Share it