Telugu Gateway
Latest News

ప్రశాంత్ భూషణ్ శిక్ష ఖరారు చేసిన సుప్రీం

ప్రశాంత్ భూషణ్ శిక్ష ఖరారు చేసిన సుప్రీం
X

సుప్రీంకోర్టు అత్యంత సంక్లిష్టంగా మారిన ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి తుది తీర్పు వెలువరించింది. ఆయనకు శిక్ష ఖరారు చేసింది. తాను ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పేందుకు నిరాకరించిన ప్రశాంత్‌ భూషణ్‌కు ఒక రూపాయి జరిమానా విధించింది. సెప్టెంబరు 15లోగా జరిమానా చెల్లించని పక్షంలో.. మూడు నెలల జైలు శిక్ష సహా మూడు నెలల పాటు న్యాయవాద వృత్తి నుంచి సస్పెన్షన్ చేస్తామని స్పష్టం చేసింది. సర్వోన్నత న్యాయవ్యవస్థ పనితీరు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులకు సంబంధించి ప్రశాంత్‌ భూషణ్‌ చేసిన రెండు ట్వీట్లు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అనుజ్‌ సక్సేనా అనే న్యాయవాది ఫిర్యాదు ఆధారంగా సుప్రీంకోర్టు ప్రశాంత్‌ భూషణ్‌పై కోర్టు ధిక్కరణ కేసు విచారణను చేపట్టడమే కాకుండా ఆగస్టు 14న ఆయనను దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో క్షమాపణ కోరాల్సిందిగా ఆదేశించింది. అయితే ఇందుకు ససేమిరా అంగీకరించని ప్రశాంత్‌ భూషణ్‌ ఆత్మసాక్షికి విరుద్ధంగా క్షమాపణ చెప్పబోనని స్పష్టం చేశారు. అదే సమయంలో తనని దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పుని రీకాల్‌ చేయాలని గత మంగళవారం కోర్టుని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో అనేక పరిణామాల అనంతరం ప్రశాంత్‌ భూషణ్‌కు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు సోమవారం నాడు తీర్పు వెలువరించింది. అయితే జరిమానా రూపాయి అయినా దీనిని కడితే ప్రశాంత్ భూషణ్ తాను తప్పుచేసినట్లు అంగీకరించినట్లు అవుతుంది. కట్టకపోతే జైలు శిక్షతోపాటు న్యాయవాద వృత్తిని వదులుకోవాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ప్రశాంత్ భూషణ్ ఏమి చేస్తారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it