Telugu Gateway
Latest News

కరోనాకు రష్యా వ్యాక్సిన్ వచ్చేసింది

కరోనాకు రష్యా వ్యాక్సిన్ వచ్చేసింది
X

ప్రపంచం అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారికంగా ప్రకటించారు. అంతే కాదు ప్రపంచంలోని తొలి కరోనా కూడా తమదే అని సగర్వంగా ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కుమార్తె కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ వార్తలు మంగళవారం మధ్యాహ్నం నుంచి పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. అయితే రష్యా వ్యాక్సిన్ పై పలువురు నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సరైన పరిశోధనలు లేకుండా ఆగమేఘాల మీద వ్యాక్సిన్ తెచ్చారని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే రష్యాకు ఇలా రహస్యంగా పనులు చేయటం అలవాటేనని మరికొంత మంది వాదిస్తున్నారు. రష్యా ఈ వ్యాక్సిన్ కు సంబంధించిన డేటాను బహిర్గతం చేస్తే అంతర్జాతీయ సమాజంలో నెలకొన్న అనుమానాలు తొలగిపోయే పరిస్థితి లేదు.

ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం రష్యా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చి సంచలనం సృష్టించిందనే చెప్పాలి. స్వయంగా రష్యా అధ్యక్షుడు దీనిపై ప్రకటన చేయటం కీలకంగ మారింది. తమ వ్యాక్సిన్‌ కరోనా వైరస్‌ను సమర్ధవంతంగా నిరోధించే వ్యాధి నిరోధకతను కలిగిఉందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే తొలి కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ను మంగళవారం ఉదయం రష్యా నమోదు చేసిందని మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ లో పుతిన్‌ వెల్లడించారు. వ్యాక్సిన్‌ పనితీరుపై తనకు సమాచారం అందించాలని ఆరోగ్య మంత్రి మైఖేల్‌ మురష్కోను ఆయన కోరారు.

ఈ నెలలోనే కరోనా వ్యాక్సిన్‌ను ప్రజల ముందుకు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించామని చెప్పారు. కొద్దివారాల్లోనే పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ ఉత్పత్తిని చేపట్టి లక్షలాది డోసులను సరఫరా చేస్తామని తెలిపారు. పుతిన్‌ తన ఇద్దరు కుమార్తెల్లో ఒకరికి వ్యాక్సిన్‌ వేయించినట్టు ప్రకటించారు. వ్యాక్సిన్‌ అందించిన తర్వాత ఆమెలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు దీటుగా పెరిగాయని చెప్పారు. తొలుత వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్‌ చేపడతామని తెలిపారు. రష్యాకు చెందిన గామలేయా ఇనిస్టిట్యూట్‌ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది.

Next Story
Share it