Telugu Gateway
Latest News

రామమందిర నిర్మాణం జాతీయ భావన

రామమందిర నిర్మాణం జాతీయ భావన
X

ప్రతిష్టాత్మక అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. బుధవారం నాడు దేశ, విదేశాల్లో జై శ్రీరామ్ నినాదం మార్మోగింది. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి అత్యంత వైభవంగా భూమి పూజ జరిగింది. భూమి పూజ అనంతరం మాట్లాడిన మోడీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జై శ్రీరామ్ నినాదంతో ఆయన తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జాతీయ భావన అని వ్యాఖ్యానించారు. రాముడి ప్రేరణతో భారత్ ముందుకెళుతుందని పేర్కొన్నారు. ఎంతో మంది త్యాగాల ఫలితంతో ప్రస్తుతం అయోధ్యలో ఇప్పుడు రామమందిర నిర్మాణం జరగుబోతుందని అన్నారు. ఈ త్యాగమూర్తులకు దేశంలో 135 కోట్ల మంది తరపున కృతజ్ణతలు తెలుపుతున్నట్లు మోడీ ప్రకటించారు. ఈనాటి జయజయధ్వానాలు రాముడికి విన్పించకపోవచ్చు కానీ..ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది భక్తులకు విన్పిస్తాయని అన్నారు. మందిరం నిర్మానానికి భూమి పూజ చేయటం మహద్భాగ్యం అని..ఈ మహద్భాగాన్ని తనకు రామ మందిరటం ట్రస్ట్ కల్పించిందని వ్యాఖ్యానించారు.

బుధవారం నాడు దేశమంతా ఆధ్మాత్మిక భావనతో నిండిపోయిందని పేర్కొన్నారు. గుడి టెంటులో ఉన్న రామమందిరం ఇక భవ్యమందిరంగా మారబోతుందని ప్రకటించారు మోడీ. రాముడు అందరి మనసుల్లో నిండి ఉన్నాడని..రాముడు అంటే మర్యాదు పురుషుడు అన్నారు. భారత్ ఆదర్శాలు..దర్శాల్లో రాముడు ఉంటారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా రామ నాపం జపించే దేశాలు ఉన్నాయన్నారు. కంబోడియా, మలేషియా, థాయ్ ల్యాండ్ ల్లో రామాయన గాథలు ఎంతో ప్రసిద్ధి అని..శ్రీలంక, నేపాల్లో రాముడు, జానకి మాత కథలు విన్పిస్తాయన్నారు. అయోధ్య చరిత్రలో నేడు ఒక సువర్ణ అధ్యాయం. ఈ ఆలయం మన భక్తికి, జాతీయ భావానికి చిహ్నంగా నిలుస్తుంది. ఆలయం కోట్ల మంది ప్రజల సమిష్టి తీర్మానం శక్తికి ప్రతీక. ఇది భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తినిస్తుంది. భారతీయ సంస్కృతికి రాముడు ప్రతీక. మందిర నిర్మాణంతో చరిత్ర సృష్టించడమే కాక.. చరిత్ర పునరావృతమవుతోంది.

నదిని దాటడానికి రాముడికి గుహుడు సాయం చేశాడు.. గోవర్ధన పర్వతాన్ని ఎత్తడానికి కృష్ణుడికి పిల్లలు సాయం చేశారు. అలానే అందరి ప్రయత్నం, కృషితో మందిర నిర్మాణం పూర్తవుతుంది. మందిర నిర్మాణంతో అయోధ్య రూపు రేఖలు మారిపోతాయి. దేశ విదేశాల నుంచి భక్తులు ఇక్కడకు వస్తారు. దాంతో ఆర్థికంగా కూడా అభివృద్ధి జరుగుతుంది. మానవుడు రాముడిని విశ్వసించినప్పుడల్లా పురోగతి జరిగిందని మనం గుర్తుంచుకోవాలి. ఆ మార్గం నుంచి తప్పుకున్నప్పుడల్లా.. విధ్వంసం తలుపులు తెరవబడ్డాయి. మనం అందరి మనోభావాలను దృష్టిలో ఉంచుకోవాలి. అందరి మద్దతు, నమ్మకంతో ప్రతి ఒక్కరి అభివృద్ధిని ఆకాంక్షించాలి’ అని మోదీ కోరారు. రామ మందిర నిర్మాణ చిహ్నంగా పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌భగవత్‌ తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it