Telugu Gateway
Latest News

రష్యా వ్యాక్సిన్... వంద కోట్ల డోసులకు ఆర్డర్లు

రష్యా వ్యాక్సిన్... వంద కోట్ల డోసులకు ఆర్డర్లు
X

వ్యాక్సిన్ రెడీ అని అలా రష్యా ప్రకటించిందో లేదో...అప్పటికే వంద కోట్ల డోసులకు ఆర్డర్లు వచ్చిపడ్డాయి. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 20 దేశాలు రష్యా వ్యాక్సిన్ కోసం బుకింగ్ లు ప్రారంభించాయి. ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్ ను తాము అందుబాటులోకి తెచ్చినట్లు ఏకంగా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతే కాదు ఈ వ్యాక్సిన్ డోస్ ను తన కూతురు తీసుకున్నట్లు ప్రకటించారు కూడా. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. రష్యా వ్యాక్సిన్ పై ప్రజలకు నమ్మకం కల్పించటం కోసమే ఇలా చేసి ఉంటారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రష్యా వ్యాక్సిన్ పై కొంత మంది నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా పలు దేశాలు మాత్రం దీని కోసం ముందస్తు బుకింగ్ లు చేసుకుంటున్నాయి.

రష్యా వ్యాక్సిన్ కు ‘స్పుత్నిక్ వీ’ పేరు పెట్టిన విషయం తెలిసిందే. ‘స్పుత్నిక్ వీ’కి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తామని ప్రకటించారు. వ్యాక్సిన్‌కు సంబంధించి వచ్చే తప్పుడు వివరాలను ఖండించడమే కాక వాస్తవాలను తెలియజేస్తామన్నారు. బుధవారం నుంచి మూడవ దశ ట్రయల్స్ ప్రారంభమవుతాయని తెలిపారు. సెప్టెంబర్ నుంచి వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమవుతుందన్నారు. ఓ వైపు వ్యాక్సిన్ ట్రయల్స్ కొనసాగిస్తూనే మరో వైపు వ్యాక్సినేషన్ కూడా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అంటే మూడవ దశలో ఉండగానే రష్యా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని ప్రకటించటం విశేషం.

Next Story
Share it