Telugu Gateway
Latest News

‘ముంచుకొస్తున్న కొత్త ముప్పు..విత్తనాలతో దాడి!

‘ముంచుకొస్తున్న కొత్త ముప్పు..విత్తనాలతో దాడి!
X

జీవవైవిధ్యానికి ముప్పు కలిగించే ఛాన్స్

రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్రం

కరోనాతోనే ప్రపంచం అంతా ఇప్పుడు నానా కష్టాలు పడుతోంది. ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ ఉపద్రవం వచ్చిపడుతుందో తెలియని పరిస్థితి. ఈ తరుణంలో కేంద్రం అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖలకు ఓ హెచ్చరిక పంపింది. వ్యవసాయ శాఖకు హెచ్చరిక ఏంటి అంటారా?. ఇప్పుడు ‘మాయా విత్తనాల ప్యాకెట్లు’ ప్రత్యక్షం అవుతున్నాయి. అవి ఎక్కడ నుంచి వస్తున్నాయో..ఎవరు పంపిస్తున్నారో తెలియదు. కానీ అవి వచ్చిపడుతున్నాయి. వీటి విషయంలో చాలా చాలా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం దేశంలోని అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖలను హెచ్చరిస్తూ ఓ నోట్ పంపింది. ఇప్పటికే ఇలాంటి మాయా విత్తనాల ప్యాకెట్ల కేసులు అమెరికా, కెనడా, యూకె, న్యూజిలాండ్, జపాన్ తోపాటు మరికొన్ని యూరోపియన్ దేశాల్లో వెలుగుచూశాయి. కొద్ది నెలలుగా ఈ వ్యవహారం సాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇలా అనుమానిత విత్తనాల ప్యాకెట్ల చేరవేత సాగింది. అమెరికా వ్యవసాయ శాఖ దీన్ని ‘వ్యవసాయ అక్రమరవాణా’గా అభివర్ణించింది.

అంతే కాదు..ఈ విత్తనాల ప్యాకెట్లలో.దాడి చేసే జాతులతోపాటు వ్యాధికారక అంశాలు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఇది పర్యావరణానికి, వ్యవసాయ విధానానికి,జాతీయ భద్రతకు కూడా ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ అనుమానిత విత్తనాల సంచులు దేశంలో జీవ వైవిధ్యానికి ముప్పు తెచ్చే అవకాశం ఉందని ..దీంతో దేశంలోని అన్ని వ్యవసాయ శాఖలు, వ్యవసాయ యూనివర్శిటీలు, విత్తన సంస్థలు, రాష్ట్ర సీడ్ సర్టిఫికెట్ ఏజెన్సీలు ఇలాంటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ డిప్యూటీ కమిషనర్ (క్వాలిటీ కంట్రోల్) డాక్టర్ దిలీప్ కె శ్రీవాత్సవ అందరినీ అప్రమత్తం చేస్తూ తాజాగా లేఖ పంపారు.

Next Story
Share it