Telugu Gateway
Latest News

పరీక్ష కోసం 105 కిలోమీటర్లు సైకిల్ పై

పరీక్ష  కోసం 105 కిలోమీటర్లు సైకిల్ పై
X

చేరాల్సిన గమ్యం దూరం. రాయాల్సిన పరీక్ష ఒకటి. ఎలాగైనా కొడుకుతో పరీక్ష రాయించేందుకు ఆ తండ్రి ఏకంగా 105 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు. చదువు అవసరం ఏంటో తనకు తెలుసని..అందుకే ఈ పని చేశానంటున్నాడు. ఒక్క సప్లిమెంటరీ పరీక్ష మిస్ అయితే మళ్ళీ తన కొడుకుకు ఏడాది వృధా అవుతుందనే ఈ నిర్ణయానికి వచ్చారు. దార్ జిల్లాలోని మానావర్ తెహశీల్ లో ఉన్న బైదిపూర్ నుంచి వీళ్ళు బయలుదేరారు. 38 సంవత్సరాల ఆ వ్యక్తి తన కొడుకును పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్ష రాయించేందుకు సైకిల్ ఎక్కించుకుని వెళ్ళాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. లాక్ డౌన్ కారణంగా ఎలాంటి రవాణా సదుపాయాలు లేవు.

దీనికి తోడు తమ చేతిలో డబ్బు కూడా లేకపోవటంతో సైకిల్ ను నమ్ముకున్నట్లు తెలిపాడు ఆ విద్యార్ధి తండ్రి శోబ్ రామ్. ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మధ్యలో మానవర్ పట్టణంలో కొన్ని గంటలపాటు ఆగారు. మరుసటి రోజు ఉదయం పరీక్ష కేంద్రం ఉన్న దార్ ప్రాంతానికి చేరుకున్నారు. తమ దగ్గర మోటార్ సైకిల్ కూడా లేదని..పైగా సాయం చేయటానికి కూడా ఎవరూ ముందుకు రాలేదని..ఏమైనా సరే పరీక్ష పూర్తి చేయించేందుకు ఈ పని చేశానని తెలిపారు.15 సంవత్సరాల ఆశిష్ సైకిల్ పై వచ్చి పరీక్ష పూర్తి చేసినట్లు తెలిపాడు.

Next Story
Share it