Telugu Gateway
Latest News

అమెరికా ఎన్నికల్లో కీలక పరిణామం

అమెరికా ఎన్నికల్లో కీలక పరిణామం
X

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ అమెరికాలో పరిణామాలు వేగంగా మారిపోతున్నయి. ఈ సారి ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంటికి వెళ్లటం ఖాయం అని బలమైన సంకేతాలు వస్తున్నాయి. ముఖ్యంగా కరోనా నియంత్రణలో ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారనే విమర్శలను మూటకట్టుకుంటున్నారు. ఈ విషయంలో ట్రంప్ వైఖరిపై చాలా మంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇదే ఆయనకు ఈ సారి పెద్ద సంకటంగా మారబోతోంది. ఇదిలా ఉంటే ట్రంప్ కు ఈ సారి గట్టి పోటీనిస్తున్న డెమొక్రాటిక్ అభ్యర్ధి జో బిడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత సంతతికి చెందిన కమలా హారిస్ ను అమెరికా ఉపాధ్యక్ష రేసులో నిలిపారు. వైస్‌ ప్రెసిడెంట్‌గా మహిళను ఎంచుకుంటానని ఇప్పటికే ప్రకటించిన బిడెన్ ఈ పదవికి మొదటి నల్లజాతి మహిళను పోటీలో నిలిపి చరిత్ర సృష్టించారు.

బ్లాక్ ఓటర్లను ఆకర్షించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెక్ పెట్టే వ్యూహంలో భాగంగా బిడెన్ హారిస్ ను ఎంపిక చేశారు. ఈ విషయాన్నిబిడెన్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. దేశంలోని అత్యుత్తమ ప్రజా సేవకులలో ఒకరంటూ హారిస్ ను ప్రశంసించిన బిడెన్ మీతో కలిసి, ట్రంప్ ను ఓడించబోతున్నామంటూ పేర్కొన్నారు. అటు హారిస్ కూడా తనను ఎంపిక చేసినందుకు సంతోషం ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం హారిస్ అభ్యర్థిత్వానికి మద్దతు పలకడం విశేషం. అమెరికా చరిత్రలో ఇంతవరకూ ఒక మహిళ అధ్యక్షులుగా లేదా ఉపాధ్యక్షురాలిగా పనిచేయలేదు. ట్రంప్ మాత్రం కమలా హారిస్ ఎంపికపై వ్యంగాస్త్రాలు సంధించారు. ఆమె ఒక భయంకరమైన వ్యక్తి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఎంపిక తనను ఆశ్చర్యానికి గురిచేసిందని వ్యాఖ్యానించారు.

Next Story
Share it