Telugu Gateway
Latest News

ఐటి శాఖ ఇక మీ లావాదేవీలు అన్నీ చూస్తుంది !

ఐటి శాఖ ఇక మీ లావాదేవీలు అన్నీ చూస్తుంది !
X

లక్ష రూపాయల ఆభరణాలు..20 వేల హోటల్ బిల్లులపైనా కన్ను

పన్ను చెల్లింపుదారుల పరిధి పెంచే సన్నాహాలు

లక్ష రూపాయల పెట్టి ఆభరణాలు కొన్నారా?. మీ హోటల్ బిల్లు చెల్లింపులు ఇరవై వేల రూపాయలు దాటాయా? ఐటి శాఖ ఇక అన్నీ క్షుణ్ణంగా పరిశీలించనుంది. ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే వారి సంఖ్యను పెంచేందుకు సర్కారు ఈ దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా ప్రధాని నరేంద్రమోడీ కూడా దేశ జనాభా 130 కోట్ల మంది అయితే..ఇందులో కేవలం 1.5 కోట్ల మంది మాత్రమే పన్నులు కడుతున్నారని..నిజాయతీగా పన్నులు కట్టాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే రాబోయే రోజుల్లో పలు లావాదేవీలను నిశితంగా పరిశీలించటం ద్వారా పన్ను చెల్లించే వారి సంఖ్యను పెంచే దిశగా సన్నాహాలు ప్రారంభించారు. లక్ష రూపాయల ఆభరణాలతోపాటు 20 వేల రూపాయల హోటల్ బిల్లులే కాకుండా ఏడాదికి లక్ష రూపాయల పైన విద్యుత్ బిల్లులు చెల్లించేవారు,దేశీయంగా బిజినెస్ క్లాస్ లో ప్రయాణించిన వారు వివరాలు అందజేయాల్సి ఉంటుంది.

విదేశీ ప్రయాణాలు, ఏడాదికి స్కూల్, కాలేజీ ఫీజుల కింద లక్ష రూపాయలపైబడి చెల్లింపులు చేసిన లావాదేవీలను అన్నింటిన ఐటి శాఖ మదింపు చేసే దిశగా సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా అధిక మొత్తంతో కూడిన లావాదేవీల డేటాను తీసుకుని ఎవరెవరు పన్నులు ఎగ్గొడుతున్నారనే విషయాన్ని గుర్తించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఐటి శాఖ పరిమితులు నిర్ణయించిన ప్రకారం లావాదేవీలు అన్నింటిని ఆయా సంస్థలు ఐటి శాఖకు అందజేయాల్సి ఉంటుంది. జీవిత బీమా ప్రీమియం కింద 50 వేల రూపాయలు, ఆరోగ్య బీమా, ప్రాపర్టీ ట్యాక్స్ కింద 20 వేల రూపాయల పైబడిన చెల్లింపులు కూడా ఈ తనిఖీ పరిధిలోకి రానున్నాయి.

Next Story
Share it