Telugu Gateway
Latest News

సీబీఐ, ఈడీ కేసుల విచారణ సాగుతుండగా జీవీకె..అదానీల ఒప్పందమా?

సీబీఐ, ఈడీ కేసుల విచారణ సాగుతుండగా జీవీకె..అదానీల  ఒప్పందమా?
X

దీనికి విచారణ సంస్థలు అభ్యంతరం చెప్పవా?

ఇంత భారీ ఫ్రాడ్ కేసులో అరెస్ట్ లు ఉండవా?

జీవీకె 705 కోట్ల ఫ్రాడ్ కేసు?

జీవీకె గ్రూపు 705 కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడిందని సీబీఐ, ఈడీలు కేసులు నమోదు చేశాయి. ఇది జరిగి నెలలు గడుస్తోంది. కానీ ఇంత వరకూ జీవీకె ప్రమోటర్లను ఏ విచారణ సంస్థ కూడా అరెస్ట్ చేయలేదు. జీవీకె గ్రూప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫ్రాడ్ అంతా కూడా ముంబయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (ఎంఐఏఎల్)లో జరిగిందనే చెబుతున్నారు. బోగస్ కాంట్రాక్టులు..నిధుల దుర్వినియోగంతోపాటు పలు అంశాలపై సీబీఐ, ఈడీలు కేసులు నమోదు చేశాయి. మరి ఏ ముంబయ్ విమానాశ్రయంలో అయితే ఏకంగా 705 కోట్ల రూపాయల స్కామ్ జరిగి ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి నష్టం చేకూర్చారని ఆరోపిస్తున్నారో అదే సంస్థ ఇప్పుడు అదానీ ఎయిర్ పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ తో ఎలా జీవీకెతో ఒప్పందం కుదుర్చుకుంది. ఓ వైపు 705 కోట్ల రూపాయల స్కామ్ విచారణ పూర్తి కాకుండానే ఈ డీల్ ఇరు కంపెనీలు చేసుకోవటం సమ్మతేనా?. దీనికి విచారణ సంస్థలు సమ్మతించాయా?.

వాటి అవసరం లేకుండానే ఇలా రెండు కంపెనీలు నేరుగా ఒప్పందం చేసుకోవచ్చా?. ఇవీ అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలు. ఉదాహరణకు ఏపీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు 150 కోట్ల రూపాయల స్కామ్ ఆరోపణలతో ఏసీబీ అరెస్ట్ చేస్తే 70 డెబ్బయి రోజులు కస్టడీలో ఉండాల్సి వచ్చింది. అలాంటిది దేశంలో అత్యున్నత విచారణ సంస్థలు అయిన సీబీఐ, ఈడీలు ఏకంగా 705 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగినట్లు ఆరోపించి..కేసులు నమోదు చేసి ఇప్పటివరకూ జీవీకె ప్రమోటర్లు ఎవరినీ అదుపులోకి తీసుకోకపోవటం వెనక మతలబు ఏంటి?. ఫ్రాడ్ జరిగినా కూడా వాళ్ళను ఫ్రీగా బయట ఎందుకు ఉండనిచ్చారు?. అదే సమయంలో ఎక్కడ అయితే స్కామ్ జరిగిందని చెబుతున్నారో అదే కంపెనీ కూల్ గా మరో సంస్థతో ఒప్పందం చేసుకుని వాటాలు అమ్మేసుకోవటానికి విచారణ సంస్థలు అనుమతించాయా?.

మరి ఇప్పుడు జీవీకె,, అదానీల ఒప్పందం ఖరారు కావటంతో ఈ కేసు సంగతి ఏమి అవుతుంది?. ఇవీ పలువురి మదిలో మెదులుతున్న ప్రశ్నలు. ఇంత కాలం జీవీకె ప్రమోటర్లను అదుపులోకి తీసుకోకపోవటానికి ఈ ఒప్పందానికి వెసులుబాటు కల్పించటానికే అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఏకంగా 705 కోట్ల రూపాయల స్కామ్ లో కేసు నమోదు అయిన వెంటనే సాక్ష్యాలు తారుమారు చేయకుండా నిందితులను అదుపులోకి తీసుకుంటారు. కానీ జీవీకె కేసులో మాత్రం అది జరగలేదు. పైగా ఇఫ్పుడు ముంబయ్ విమానాశ్రయ యాజమాన్య మార్పిడికి అవకాశం కల్పించారంటే లోపల పెద్ద కథే నడిచి ఉంటుందని కార్పొరేట్ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఈ తరహా వ్యవహారాలు గతంలో ఎప్పుడూ జరగలేదనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Next Story
Share it