హెచ్1 బీ వీసాలపై ట్రంప్ కీలక నిర్ణయం

గత కొంత కాలంగా హెచ్1 బీ వీసా హోల్డర్లకు చుక్కలు చూపిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సారి కొంత రూట్ మార్చారు. ఎన్నికల సమయం ముందు కాస్త సడలింపులు ఇఛ్చారు. ట్రంప్ నిర్ణయాలపై అమెరికాలోని దిగ్గజ సంస్థలు అన్నీ వ్యతిరేకత వ్యక్తం చేస్తుండటంతో ఆయన మనసు మార్చుకున్నట్లు కన్పిస్తోంది. తాజాగా వెలువడిన నిర్ణయం ప్రకారం హెచ్1బీ వీసాహోల్డర్లు తమ పాత ఉద్యోగాన్ని కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. హెచ్1బీ తోపాటు వివిధ రకాల విదేశీ వర్క్ వీసాలను ఈ ఏడాది డిసెంబరు వరకూ రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ నిర్ణయం ప్రస్తుతం అమల్లో ఉంది. అయితే ఈ వీసాలపై నిషేధానికి ముందు ఏ ఉద్యోగం చేశారో, అదే ఉద్యోగంలో కొనసాగేందుకు అనుమతి ఇస్తూ ట్రంప్ సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ఆ వీసాదారులపై ఆధారపడేవాళ్లు, వారి జీవిత భాగస్వాములు, పిల్లలు అగ్రరాజ్యం ప్రయాణం చేసేందుకు అనుమతి కల్పించారు. కరోనా వ్యాప్తి కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ఈ వీసాలతో ఉన్న విదేశీ టెక్నికల్ స్పెషలిస్టులు, సీనియర్ లెవల్ మేనేజర్ల సేవలు ఎంతగానో అవసరముందని అమెరికా పేర్కొంది.