Telugu Gateway
Latest News

హైదరాబాద్ లోనే 6.6 లక్షల మందికి కరోనా!

హైదరాబాద్ లోనే 6.6 లక్షల మందికి కరోనా!
X

మరో లెక్క ప్రకారం 2.6 లక్షల మందికి

సీసీఎంబీ సంచలన నివేదిక

కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సంచలన నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలోని ఓ అంచనా ప్రకారం ఒక్క హైదరాబాద్ లోనే 6.6 లక్షల మందికి కరోనా వచ్చినట్లు అంచనా వేశారు. మరో లెక్క ప్రకారం మాత్రం 2.6 లక్షల మందికి కరోనా వచ్చినట్లు తేల్చారు. 35 రోజుల కాలపరిమితిని తీసుకుని ఓ అంచనాకు వచ్చారు. అయితే ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం బుధవారం నాటికి తెలంగాణ అంతటా కలిపినా కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 95,700 మాత్రమే. సీసీఎంబీ పరిశోధనలో తేలిన అంశం ఏమిటంటే ఎక్కువ మంది వైరస్ సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు లేవని తేల్చారు. వీరు చాలా మంది ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం కూడా లేదన్నారు. కరోనా వైరస్ సోకిన వారి నాసికా ద్రవాలు, నోటి మార్గాల ద్వారా మాత్రమే కాకుండా మలమూత్ర విసర్జన ద్వారా కూడా వైరస్ బహిర్గతం అవుతుందని పేర్కొన్నారు.

మురుగునీటి పరీక్షల ద్వారా వివిధ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని నిర్ధారించవచ్చని తెలిపారు అయితే మురుగు నీటిలో వైరస్ ఉండదని తెలిపారు. అయితే ఈ పరిశోధనల ద్వారా రోగాల తీరు అర్ధం చేసుకునేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో ఉపయోగిస్తున్న 1800 మిలియన్ల నీటిలో 40 శాతం మాత్రమే మురుగునీటిని శుభ్రపరిచే కేంద్రాలకు చేరుతున్నాయి. దీని ఆధారంగా ఎంత మంది ప్రజలపై కరోనా ప్రభావం పడిందనే అంచనాకు రావటానికి ఉపయోగపడిందని తెలిపారు. నగర జనాభాలో 6.6 శాతం మంది ప్రభావానికి గురయినట్లు అంచనాకు వచ్చారు. ఇందులో లక్షణాలతో ఉన్న వారితోపాటు ఏ మాత్రం లక్షణాలు లేని వారు..కరోనా సోకి కోలుకున్న వారు కూడా ఉన్నారు. వ్యర్ధాల ద్వారా జరిపిన పరీక్షలను సీఎస్ఐఆర్-సీసీఎంబి కోవిడ్ 19 పరీక్షా కేంద్రాల్లోనే నిర్వహించినట్లు తెలిపారు.

Next Story
Share it