Telugu Gateway
Latest News

సుశాంత్ సింగ్ మృతిపై సీబీఐ విచారణ

సుశాంత్ సింగ్ మృతిపై సీబీఐ విచారణ
X

దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్ సర్కారు కోరిన విధంగా సీబీఐ విచారణకు ఓకే చెప్పేసింది. ఈ కేసు విచారణ అంశంపై ఇప్పటికే మహారాష్ట్ర, బీహార్ సర్కార్ ల మధ్య వివాదం నడుస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబం కూడా మహారాష్ట్రలో విచారణ సరిగా సాగుతుందనే నమ్మకం లేదంటుంటే...సుశాంత్ మరణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి మాత్రం కేసును బీహార్ నుంచి ముంబయ్ కు బదిలీ చేయాలని కోరింది. ఈ తరుణంలో కేంద్రం సీబీఐ విచారణకు అనుకూలంగా కీలక నిర్ణయం తీసుకోవటం విశేషం. బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి కూడా ఇఫ్పటికే రెండుసార్లు ఇదే అంశంపై ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. అంతే కాదు..సుశాంత్ సింగ్ దే హత్య అనే..ఆత్మహత్య కాదు అంటూ ఆయన పేర్కొన్నారు. తాజాగా సుశాంత్ సింగ్ ఖాతాలోని కోట్లాది రూపాయల నిధులు అతి తక్కువ సమయంలో మాయం అయినట్లు ఆరోపణలు రావటంతో దీనిపై కూడా విచారణ సాగుతోంది. సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ కోరుతూ బీహార్ ప్రభుత్వం చేసిన సిఫారసును కేంద్రం అంగీకరించిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపారు.

ఈ కేసును పట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలంటూ రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంలో విచారణ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సంఘటన మొత్తం ముంబైలో జరిగిందని, సుశాంత్ మరణించిన వెంటనే, ముంబయ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి 56 మందిని ప్రశ్నించారని రియా న్యాయవాది శ్యామ్ దివాన్ వాదించారు. కాబట్టి దర్యాప్తు బాధ్యత ముంబై పోలీసులదేనని సుప్రీంకు తెలిపారు. అయితే ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినప్పటికీ చాలా సాక్ష్యాలు మాయమయ్యాయని సుశాంత్ తండ్రి న్యాయవాది వికాస్ సింగ్ అన్నారు. దర్యాప్తులో ముంబై పోలీసులు బిహార్ పోలీసులకు సహకరించడం లేదని వాదించారు. ఈ వాదనలపై స్పందించిన సుప్రీంకోర్టు ఇది హై ఫ్రొఫైల్ కేసు...ప్రతిభావంతుడైన కళాకారుడు (సుశాంత్) అనుమానాస్పద పరిస్థితిలో మరణించారు. ఈ కేసులో నిజానిజాలు బయటికి రావాలని వ్యాఖ్యానించింది. అంతేకాదు బీహార్ పోలీసు అధికారిని క్వారంటైన్ చేయడం మంచి సంకేతం కాదని పేర్కొంది. దీనిపై ఇప్పటివరకు జరిపిన దర్యాప్తుపై స్టేటస్ రిపోర్ట్ మూడు రోజుల్లో సమర్పించాలని ముంబయ్ పోలీసులను ఆదేశించింది.

Next Story
Share it