Telugu Gateway
Latest News

ఇది వెరైటీ.... ఢిల్లీ నుంచి లండన్ కు బస్సు సర్వీసు

ఇది వెరైటీ.... ఢిల్లీ నుంచి లండన్ కు బస్సు సర్వీసు
X

18 దేశాలు..20 వేల కిలోమీటర్లు..70 రోజులు

టిక్కెట్ ధర 15 లక్షలు

ఫ్లైట్ లో ఎక్కడైనా వెళ్లటం మామూలే. విదేశాలు అయితే సహజంగా ఫ్లైటే మార్గం. కానీ ఇద్దరు ఔత్సాహికులు వెరైటీగా కొత్త ప్లాన్ వేశారు. ఏకంగా ఢిల్లీ నుంచి లండన్ కు బస్సు సర్వీసులు పెడితే...వినగానే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. కానీ ఇది నిజం చేయబోతున్నారు ఇద్దరు ఔత్సాహికులు. అది కూడా వచ్చే ఏడాది మేలోపే. ఆశ్చర్యంగా ఉన్నా నిజమే ఇది.అంతే కాదు..ప్రపంచంలోనే అతి పెద్ద బస్సు యాత్ర కూడా ఇదే కానుంది. ఓ కంపెనీ దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన చేసింది. గురుగ్రామ్ కు చెందిన కంపెనీ వచ్చే ఏడాది మే నుంచి ఈ సర్వీసును ప్రారంభించబోతోంది. ఈ డెబ్బయి రోజుల పర్యటనలో మొత్తం జర్నీ 20 వేల కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో ఏకంగా 18 దేశాలు కవర్ అవుతాయి. ఆయా దేశాలకు సంబంధించిన వీసాల వ్యవహారంతోపాటు ఈ డెబ్బయి రోజుల్లో 4స్టార్ లేదా 5 స్టార్ వసతి, భారతీయ వంటకాలతో కూడిన ఆహారం అందిస్తారు. అడ్వెంచర్స్ ఓవర్ ల్యాండ్ ‘బస్ టూ లండన్’ పేరుతో ఈ సర్వీసులు ప్రారంభించనుంది. ఈ టూర్ కు గాను కంపెనీ ఒక్కో వ్యక్తి నుంచి 15 లక్షల రూపాయల మేర ఛార్జ్ చేయనుంది. ఈ టూర్ లో మయన్మార్, థాయ్ లాండ్, లావోస్, చైనా, కిర్జికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, రష్యా, లాట్వియా, లిథూనియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్ దేశాలు కవర్ కానున్నాయి. 20 సీట్లు మాత్రమే ఉండే ఈ ప్రత్యేక బస్సలో బిజినెస్ క్లాస్ సీట్లు కూడా ఉంటాయి.

ఈ పర్యటన కోసమే బస్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ ట్రిప్ ను నాలుగు కేటగిరీలుగా విభజించనున్నారు. పర్యాటకులు తమకు నచ్చిన క్యాటగిరిని ఎంపిక చేసుకుని దానికి అనుగుణంగా చెల్లింపులు చేయాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. పర్యటనలు అంటే ఎంతో ఆసక్తి ఉన్న తుషార్ అగర్వాల్, సంజయ్ మదన్ లు ఈ బస్సు ట్రిప్ ప్లాన్ చేశారు. వీరిద్దరూ 2017తోపాటు 2018, 2019లో రోడ్డు ట్రిప్ ద్వారా లండన్ వెళ్చొచ్చారు కూడా. చాలా మంది రోడ్డు మార్గం ద్వారా లండన్ వెళ్లటానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారని..అందుకే తాము ఈ ప్లాన్ చేశామని తుషార్ అగర్వాల్ చెప్పినట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక వార్తను ప్రచురించింది. ప్రస్తుతం కరోనా వైరస్ ఉన్నందున ఇంకా రిజిస్ట్రేషన్లు ప్రారంభించలేదని..కరోనా తగ్గుముఖం పట్టగానే ప్రారంభిస్తామని తెలిపారు.

Next Story
Share it