Telugu Gateway
Latest News

ఊపందుకుంటున్న ‘వాట్సప్ వైద్యశాస్తం’!

ఊపందుకుంటున్న ‘వాట్సప్ వైద్యశాస్తం’!
X

అదృష్టం కొద్ది అందుబాటులో ఉన్న మందులే కొన్ని దేశంలో కరోనా బాధితులను చాలా వరకూ రక్షిస్తున్నాయి. అంతే కానీ కరోనా వైరస్ కు ఇప్పటివరకూ ప్రత్యేకంగా మందు అంటూ ఏమీ తయారు కాలేదు.ఈ వైరస్ ను నిర్మూలించే వ్యాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ ఫార్మా సంస్థలు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. చాలా మంది సంప్రదాయ ఔషధాలను వాడుతూ తమ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకుని కరోనా నుంచి రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాట్సప్ ల్లో మాత్రం కరోనాను నిరోధించేందుకు చాలా మందులే ప్రచారంలో పెడుతున్నారు. అందులో నిజం ఎంత?. అసలు దాన్ని నమ్మోచ్చా అనే అంశాలు ఏమీ పరిశీలించకుండా మనకు వచ్చింది కదా..మన కూడా పంపేస్తే పోలా అంటూ ‘ఎత్తిపోతల పథకాల’ ను అమలు చేస్తున్నారు. పోనీ ఆ మెసేజ్ అందుకున్న వ్యక్తి పంపిన వాళ్లకు రివర్స్ ఫోన్ చేసి ఇందులో నిజానిజాలు ఏంటి?. ఇది శాస్త్రీయమా? ఎవరైనా డాక్టర్లు చెప్పారా?. అలా వాడిన వాళ్లు ఎవరైనా కోలుకున్నారా? వంటి ప్రశ్నలు సంధిస్తే మాత్రం అబ్బే అవన్నీ నాకేమీ తెలుసు..ఎవరో పంపారు..నేను నీకు పంపాను అంటూ ఒక్క మాటలో తేల్చేస్తారు. ముఖ్యంగా నిత్యం ఇళ్ళలో ఉపయోగించే పసుపు, మిరియాలు, తులసీ ఆకులు, లవంగాలు ఇతర ఏ దినుసుల అంశంపై ప్రచారం జరిగినా ..వాడినా పెద్దగా ప్రమాదం ఉండదు. కానీ ఏకంగా కొంత మంది రకరకాల మందులను కూడా ఈ వాట్సప్ వైద్యశాస్త్రానికి చెందిన డాక్టర్లు సిఫారసులు చేస్తున్నారు.

ఇది ప్రమాదకర పరిణామంగా మారుతోందని డాక్టర్లు కూడా చెబుతున్నారు. వాట్సప్ ల్లో వచ్చే మెసేజ్ లను ఏ మాత్రం నమ్మవద్దని..ముఖ్యంగా మందుల విషయంలో డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే ముందుకెళ్లాలని సూచించారు. ఈ మధ్యే కొత్తగా ఓ మెసేజ్ వాట్సప్ ల్లో విస్తృతంగా సర్కులేట్ అయింది. కొన్ని చిన్న పత్రికలు కూడా వార్తలు రాశాయి. అదేంటి అంటే ఓ 90 ఎంఎల్ మందేస్తే చాలు, దాంటో ఏవేవో తినాలంటూ రాసేశారు. కరోనా వచ్చిన తొలి రోజుల్లోనే హైడ్రాక్సీక్లోరోక్వీన్ మందు వేసుకుంటే కరోనా రాదంటూ ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అంతే కాదు తాను వేసుకున్నానంటూ కూడా బహిరంగంగానే చెప్పారు. అంతే కాదు భారత్ లోనూ ముందు జాగ్రత్తగా ఐసీఎంఆర్ సూచనల మేరకు హైడ్రాక్సీక్లోరోక్వీన్ మందులు ఉపయోగించారు. ఇప్పుడు తాపీగా అదేమి అసలు పనిచేయదని నిపుణుల తేల్చారు. అత్యంత పవర్ ఫుల్ అని ప్రచారం చేసిన ఎన్ 95 మాస్క్ కరోనా ను నియంత్రించలేదని ప్రకటించారు. ఎంతో పేరున్న డాక్టర్లు..నిపుణులు చెప్పిన మాటలకే దిక్కులేకుండా పోతోంది. మరి వాట్సప్ వైద్యులను నమ్ముకుంటే ఏమవుతుందో ఎవరికి వారే ఆలోచించుకోవాలి.

Next Story
Share it